తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలోని పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా, ఆయన దూరంగా ఉండటం పలు ఇటీవల రాజకీయ పరిణామాలకు నిదర్శనం అని చెప్పవచ్చు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొంతకాలంగా స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేరస్తున్నారు. 1971 జనాభా గణాంకాల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్రానికి మధ్య హిందీ భాషా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోదీ పర్యటనకు సీఎం స్టాలిన్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రధాని మోదీ పాంబన్ లో పర్యటిస్తున్న సమయంలో సీఎం స్టాలిన్ ఊటీలో ఓ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో నియోజకవర్గాల పునర్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. "ప్రధాన మంత్రి తమిళ గడ్డపై నిలబడి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. జనాభా వృద్ధిని విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాలకు రాబోయే నియోజకవర్గాల పునర్విభజన వ్యాయామంలో నష్టం వాటిల్లకూడదు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణలో విజయం సాధించాయి. వాటి పార్లమెంటరీ సీట్ల సంఖ్యలో మార్పు ఉండకూడదు. ఈ మేరకు ప్రధానమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలి" అని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.
![]() |
![]() |