ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఉండొద్దు.... తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం

national |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 08:53 PM

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తాత్సారం చేయడాన్ని తప్పుబట్టింది. ఇది చట్టవిరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని వ్యాఖ్యానించింది. గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని కోర్టు ఆక్షేపించింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే క్లియర్ చేయాల్సి ఉండగా అలా చేయలేదని తెలిపింది. ఈ తీర్పుతో గవర్నర్ అధికారులు, పరిధులు ఏంటి? అనేది సుప్రీంకోర్టు మరోసారి గుర్తుచేసింది. అంతేకాదు, తాము గవర్నర్ అధికారాలపై పరిమితులు విధించలేదని పేర్కొన్న న్యాయమూర్తులు.. ఈ సందర్భంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ప్రస్తావించారు. గవర్నర్ తీసుకునే అన్ని చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.


ఇక, గవర్నర్లు తీరు తరుచూ వివాదాస్పదమవుతోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉండే రాష్ట్రాలపై గవర్నర్ ద్వారా కక్షసాధింపులకు దిగుతున్నారని, రాజ్‌భవన్ రాజకీయ కేంద్రంగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ్ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఏకంగా రాజ్‌భవన్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాజ్‌భవన్, సీఎంవో మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్‌ ప్రభుత్వాలు, గవర్నర్లు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఏకంగా గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలోనూ కేసీఆర్, తమిళిసై సౌందర్‌రాజన్ ఉప్పునిప్పులా పరస్పర బహిరంగ విమర్శలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తొలగించారు. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలి? గవర్నర్ అధికారాల గురించి రాజ్యాంగం ఏం చెప్పింది? అనేది సుప్రీంకోర్టు తీర్పుతో చర్చనీయాంశంగా మారింది.


దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌ల మధ్య సంబంధం సంక్లిష్టమైంది. తరచుగా సహకారంతో కూడింది అయినా ఘర్షణలు, విభేదాలకు కూడా గురవుతుంది. గవర్నర్ రాష్ట్ర అధిపతి: గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి.. ఐదేళ్ల పదవీకాలానికి రాష్ట్రపతి నియమిస్తారు. అయితే, ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం: రాష్ట్రంలో నిజమైన కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలికి ఉంటుంది. ప్రజలచే ఎన్నికోబడి, రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా ఉంటారు.


ఆర్టికల్ 163: ఈ అధికరణ గవర్నర్ మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరిస్తారని పేర్కొంటుంది. వారి స్వంత అభీష్టానుసారం వ్యవహరించాల్సిన విషయాలు మినహా ఈ "విచక్షణాధికారం" ఘర్షణకు దారితీయడంలో కీలకంగా మారుతుంది


గవర్నర్ అధికారాలు


రాష్ట్ర శాసనసభను సమావేశపరచడం, వాయిదా వేయడం, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం, శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం వంటి లాంఛనప్రాయమైన విధులను నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధి: గవర్నర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తారు, కేంద్రానికి రాష్ట్ర వ్యవహారాల గురించి తెలియజేస్తూ ఉంటారు. రాజ్యాంగ బాధ్యతలు: రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వం దాని నిబంధనల ప్రకారం పనిచేస్తుందని నిర్ధారించడం వంటివి గవర్నర్ బాధ్యతలు


అయితే, రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలను కల్పించింది. ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. రాజ్‌భవన్ నుంచి రాజకీయాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు ఆమోదం నిలిపివేసి, దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. ఇందుకు స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉంది. బిల్లులకు ఆమోదం నిలిపివేయడం లాంఛనప్రాయమైనప్పటికీ.. కొన్నిసార్లు రాజ్యాంగపరమైన ఆందోళన వ్యక్తం చేస్తూ వివరణలు కోరుతూ బిల్లును నిలిపివేయడం ప్రతిష్టంభనకు దారితీస్తుంది. బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యానికి రాజకీయ కారణాలేనని, ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని తరచుగా ఆరోపణలు వస్తున్నాయి.


పరిపాలనలో జోక్యం


గవర్నర్ రాజ్యాంగ అధిపతి అయినప్పటికీ, ఎన్నికైన ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాల్లో ఏదైనా జోక్యం ఉన్నట్లు భావిస్తే అది ఘర్షణకు దారితీస్తుంది. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్‌ఆర్ రవి మధ్య ఇదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా విభేదాలు తలెత్తాయి. గతేడాది అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో జాతీయ గీతం ఆలపించనందుకు నిరసనగా గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. సంప్రదాయం ప్రకారం, సభ ప్రారంభంలో తమిళ రాష్ట్ర గీతం, చివరలో జాతీయ గీతం ఆలపిస్తారు. కానీ, జాతీయ గీతం రెండుసార్లు ఆలపించాలని గవర్నర్ రవి పట్టుబట్టారు.


2023లో, గవర్నర్ రవి అసెంబ్లీలో తన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. అంతకు ముందు బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై పేర్లు, 'ద్రవిడ నమూనా' అనే పదబంధం, తమిళనాడులో శాంతిభద్రతలకు సంబంధించిన కొన్ని ప్రస్తావనలను ఆయన చదవడానికి నిరాకరించారు.


ఆర్టికల్ 200 ప్రస్తావన


ఈ వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తమిళనాడు ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. గవర్నర్ అధికారాల పరిధిని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఏం చేయాలో? ఎలా వ్యవహరించాలో? తీర్పులో ప్రస్తావించింది. ఇది కేవలం తమిళనాడుకే మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో చీటికీ మాటికీ తలదూర్చడం, రాష్ట్ర సర్కారు సాఫీగా పనిచేయకుండా ఆంటకాలు కలిగించడం కేరళ, పంజాబ్‌, కర్ణాటక, పశ్చిమ్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో నిత్యకృత్యమైంది


రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌ల మధ్య సంబంధాలు రాజ్యాంగాన్ని పరిరక్షించడం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అనుసంధానంగా పనిచేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. , రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండటం, ఒకరి పాత్రను మరొకరు గౌరవించడం, సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అవసరాన్ని నొక్కిచెప్పింది. ఈ తీర్పుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ మంత్రులు, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa