దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజే హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ మెప్పుకోసం చట్టాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక స్పూర్తిని గౌరవించకుండా హిందూపురం పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. మాజీ సీఎం వైయస్ జగన్ ను దూషిస్తూ ముదిరెడ్డిపల్లికి చెందిన మోహన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ను హిందూపురంకు చెందిన బీసీ యువకుడు వాల్మీకి లోకేష్, దళిత యువకుడు అంబేడ్కర్ నవీన్ ప్రశ్నించారని తెలిపారు. అధికారపార్టీకి చెందిన వారినే ప్రశ్నిస్తావా అని ఆగ్రహించిన టీడీపీ పెద్దల డైరెక్షన్‌తో పోలీసులు రంగంలోకి దిగారని అన్నారు. హిందూపురంలో ఈ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంకెళ్ళు వేసి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో పోలీసులు అమానుషంగా నడిపించుకుంటూ, అధికార పార్టీని ప్రశ్నిస్తే ఇలాంటి గతే పడుతుందని సందేశం ఇచ్చేలా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న సందర్భంలో వారి చేతికి బేడీలు వేసి, క్రూరమైన పద్దతుల్లో లాక్కెళ్ళడం కూడదనే దానిపై న్యాయస్థానాల నుంచి నిర్ధిష్టమైన తీర్పులు ఉన్నాయన్నారు. పోలీసులు సైతం ఆ చట్టాలకు లోబడే పనిచేయాలి. చంద్రబాబు, లోకేష్‌ల మెప్పుకోసం తాము చట్టాలకు అతీతులమనే విధంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
![]() |
![]() |