ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై ఏపీ కేబినెట్ చర్చిస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణ కోసం సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అమరావతి పరిధిలో 92 పనుల కోసం సుమారుగా రూ.65 వేల కోట్లు నిధులు అవసరమవుతాయని అంచనా. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను ఇప్పటికే కొన్ని సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలకు నిర్మాణ పనులు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అయినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగా కనిపించింది. పవన్ కళ్యాణ్ అస్వస్థత కారణంగా ఈ భేటీకి హాజరుకాలేకపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో ఉదయం పదిన్నరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కోసం వచ్చినట్లు తెలిసింది. అయితే సమావేశం ప్రారంభమయ్యేలోగా ఆరోగ్యం సహకరించకపోవటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలోనూ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు.
ఫిబ్రవరిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ కారణంగా పవన్ కల్యాణ్ ఏపీ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని అప్పట్లో డిప్యూటీ సీఎంవో వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనతో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని అప్పట్లో ప్రకటన కూడా విడుదల చేశాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సమయంలోనూ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ప్రచారం సమయంలో జనసేన అధిష్ఠానం.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు కూడా అప్పట్లో చేసింది. పూలదండలు వేయొద్దంటూ అప్పట్లో కీలక సూచనలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa