ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో ఐడీఎఫ్ ఘోరం.. 15 వైద్యులు మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 11:23 PM

గాజాలో ఈ ఏడాది జనవరి 19న అమల్లోకి వచ్చిన ఇజ్రాయేల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం.. మార్చితో ముగిసింది. అప్పటి నుంచి గాజా నగరంపై ఇజ్రాయేల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో గాజాలోని రఫా సమీపాన మార్చి 23న ఇజ్రాయేల్ సైన్యం జరిపిన దాడుల్లో 15 మంది అత్యవసర సేవల సిబ్బంది మృతి ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇజ్రాయేల్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించగా.. విస్మయానికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది పూర్తిగా సైనికుల వైఫల్యమేనని తేలింది. దీంతో యూనిట్‌కు బాధ్యత వహించిన ఫీల్డ్ కమాండర్‌ను తొలగించనున్నట్లు ఇజ్రాయేట్ ప్రకటించింది. గాజా దక్షిణ భాగంలోని రఫా నగర సమీపంలో జరిగిన ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ తుర్క్ కూడా స్పందించారు. ఇది యుద్ధ నేరంగా పరిగణించవచ్చని మండిపడ్డారు. అయితే, ఇజ్రాయేల్ మాత్రం ఆ రోజు కాల్పులకు గురైన అంబులెన్సుల్లో ఆరుగురు హమాస్ మిలిటెంట్లు ఉన్నారని పేర్కొంది.


‘అనియంత్రిత కాల్పులు జరగలేదు, కానీ సైనికులు తమకు ఎదురైన నిజమైన బెదిరింపులకు స్పందించేందుకు అప్రమత్తంగా ఉన్నారు.. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వడంలో విఫలమైనందుకు ఫీల్డ్ కమాండర్‌ను తొలగిస్తున్నాం’ అని తెలిపింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది పౌరులు మృతి చెందగా, వారిలో ఆరుగురు హమాస్ సభ్యులని విచారణలో గుర్తించామని చెప్పింది. అయితే, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేసింది.


పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన సమయంలో గాజా రెడ్ క్రెసెంట్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది రఫా సమీపంలోని ఓ వైమానిక దాడి తర్వాత బాధితులను సహాయానికి వెళుతున్నారు. ఈ కాల్పుల్లో రెడ్ క్రెసెంట్‌కు చెందిన 8 మంది, గాజా సివిల్ డిఫెన్స్‌కు చెందిన ఆరుగురు, ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ ఉద్యోగి మృతి చెందారు.


కాల్పులకు గురైన వాహనాలపై లైట్లు లేవని ఇజ్రాయేల్ బుకాయించినప్పటికీ.. రెడ్ క్రెసెంట్ విడుదల చేసిన వీడియోలో ఆంబులెన్సులు హెడ్‌లైట్లు, ఎమర్జెన్సీ లైట్లు ఆన్ చేసి ఉన్నట్లు కనిపించింది. మృతదేహాలను రఫా నగరంలోని తాల్ అల్-సుల్తాన్ ప్రాంతంలో సమాధి చేశారు. ఇక, అక్టోబరు 7, 2023 నాటి హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. ఏడాదిన్నరగా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. రెండు నెలల పాటు కాల్పలు విరమణ పాటించి.. మళ్లీ మార్చిలో దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రఫాలో అత్యవసర వైద్య సేవల సిబ్బంది వాహానంపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa