పరీక్షల ఫలితాలు వచ్చాయంటే చాలు.. మార్కుల సంగతి పక్కకు పెడితే.. ఫెయిల్ అయ్యాము.. తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునే విద్యార్థుల వార్తలే ఎక్కువగా కనిపిస్తాయి. నిండా 18 ఏళ్లు కూడా లేని పిల్లలు.. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే లేదని ఫీలవుతూ.. ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే.. మన సమాజంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పిల్లల చదువు, మార్కులను కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా భావించే తల్లిదండ్రులున్నంత కాలం.. చదువు హత్యలు ఆగవు. అలా కాకుండా ఫెయిల్ అయితే మళ్లీ ప్రయత్నించమని భుజం తడితే.. ఇదుగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తిలా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఇంటర్లో ఫెయిలైన ఆ వ్యక్తి.. ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు..
యూపీఏఎస్సీ 2024 సివిల్స్ ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 1,009 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 మంది అభ్యర్ధులు ఎంపికైనారు. ఇందులో తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ సివిల్స్‌లో ఏకంగా 988వ ర్యాంకు సాధించారు. ఆయన విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే..
ఇంటర్లో ఫెయిల్..
సురేష్ పదో తరగతి వరకు సాధారణ విద్యార్థి.. అంతేకాక ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయ్యాడు. దాంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్లు సురేష్‌ని హేళన చేయసాగారు. ఎందుకు పనికిరాడని ఎగతాళి చేసేవారు. కానీ సురేష్ మాత్రం కుంగిపోలేదు.. ఫెయిల్ అయినందకు భయపడలేదు. ఎలాగైనా జీవితంలో గెలవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. అందుకే తిరిగి నంద్యాలలో డిప్లొమా కోర్సులో చేరారు. ఆ సమయంలో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం పుస్తకాలు చదివి ఎంతో స్ఫూర్తి పొందినట్లు చెప్పుకొచ్చారు సురేష్. చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందని గట్టిగా నమ్మిన సురేష్.. సివిల్స్‌ను తన జీవిత గమ్యంగా మార్చుకున్నారు.
డిప్లొమా తర్వాత ఈసెట్ రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించి సత్తా చాటారు సురేష్. కర్నూలులో ఇంజినీరింగ్ పూర్తి చేశాక.. 2011లో జెన్కోలో ఏఈ ఉద్యోగం సాధించారు. కానీ తన ధ్యేయం సివిల్స్. అందుకే 2017లో తొలిసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు.. అయితే ఆ ప్రయత్నంలో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేకపోయారు. అయినా ధైర్యం కోల్పోలేదు. మరింత కష్టపడి చదివిన ఆయన రెండో ప్రయత్నంలో ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.
వినికిడి సమస్యతో మరోసారి లక్ష్యం మార్పు..
అయినా వెనకడుగు వేయకుండా మళ్లీ తన ప్రయత్నాలు ప్రారంభించారు సరేష్. అయితే 2020లో మరో సారి సివిల్స్‌కు సన్నద్ధమవుతుండగా కొవిడ్ మహమ్మారి బారిన పడటంతో వినికిడి సమస్య తలెత్తింది. ఇలా తరచుగా ఏదో ఒక అడ్డంకి వచ్చేది. అయినా సరే సురేష్ ధైర్యం కోల్పోలేదు. కాకపోతే వినికిడి సమస్య కారణంగా ఐపీఎస్ కావాలన్న తన లక్ష్యానికి అర్హత సాధించలేకపోయారు. అప్పుడేఆయన ఐఏఎస్ సాధించాలని మనసు మార్చుకున్నారు.
సివిల్స్ సన్నద్ధతకు ఇబ్బందిగా ఉందని 2020లో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. అప్పట్లోనే సురేష్‌కు నెలకు ఏకంగా రూ.1.50 లక్షల జీతం వచ్చేది. సివిల్స్ కోసం భారీ వేతనం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకుని కోవిడ్ అనంతరం మూడు సార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాడు. చివరకు 2024లో అనగా ఏడో ప్రయత్నంలో ఏకంగా 988వ ర్యాంకు సాధించారు. ఫెయిల్యూర్స్ వస్తే కుంగిపోకుండా.. ధైర్యంగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది అనే దానికి సురేష్ జీవితమే ఒక ఉదాహరణ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa