ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో విశిష్ట స్థానం కలిగిన విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల ఏఎంసీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 'శతాబ్ది భవనాన్ని' ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కళాశాల పూర్వ విద్యార్థులు తమ సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ భవన నిర్మాణానికి పూనుకోవడం విశేషం.పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన ఈ నూతన అలుమ్ని భవనం, ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. దీనిని ఈస్ట్, వెస్ట్ బ్లాకులుగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం నాలుగు అంతస్తులున్న ఈస్ట్ బ్లాక్‌లో, కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరిన వారి వివరాలు, చిత్రపటాలతో కూడిన గ్యాలరీ, ఒక గ్రంథాలయం, విద్యా సంబంధిత కార్యకలాపాల కోసం ఒక అంతస్తు, కెఫెటేరియా వంటివి ఏర్పాటు చేశారు. వెస్ట్ బ్లాక్‌లో సుమారు 600 మంది ఆశీనులయ్యే సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలున్న సమావేశ మందిరం నిర్మించారు. ఈ భవన నిర్మాణం కళాశాల అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ వైద్య కళాశాలలో విద్యాభ్యాసం చేసి, ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్నత వైద్య నిపుణులుగా స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ కృతజ్ఞత చాటుకుంటూ సుమారు రూ.45 కోట్ల నిధులను సమకూర్చారు. ఈ నిధులతో అత్యాధునిక సదుపాయాలతో కూడిన రెండు బ్లాకులను శతాబ్ది భవనంగా నిర్మించారు. ఆంధ్ర వైద్య కళాశాల స్థాపించి 2023 జులై నాటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అదే ఏడాది అక్టోబరు నెలలో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఈ నూతన భవన సముదాయాన్ని పూర్వ విద్యార్థులు నిర్మించి, కళాశాలకు అంకితం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భవనాన్ని ప్రారంభించి, పూర్వ విద్యార్థుల సేవానిరతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
![]() |
![]() |