సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన చందనోత్సవంలో దుర్ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. రూ.300 టికెట్ క్యూలైన్‌లో ఉన్న భక్తులపై గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో, మాజీ సీఎం జగన్ బుధవారం (ఏప్రిల్ 30, 2025) మధ్యాహ్నం 3:30 గంటలకు విశాఖపట్నం వెళ్లనున్నారు. అక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, అలాగే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో బాధితులకు అండగా నిలిచేందుకు ఆయన ఈ సందర్శన ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. సింహాచలం ఆలయంలో భక్తుల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa