భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఎస్-400 ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయగా.. ప్రతిగా పాక్ కూడా డ్రోన్లు, మిసైళ్లతో భారత్‌పైకి దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఎస్-400 మిసైల్ సిస్టమ్.. పాక్ దాడులను సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకోవడమే కాకుండా వాటిని కూల్చివేసింది. దీంతో పాకిస్తాన్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఎస్-400 క్షిపణి వ్యవస్థ సామర్థ్యం చూసి అవాక్కయ్యారు. పాక్ నుంచి వచ్చిన అనేక ముప్పులను ఎస్-400 విజయవంతంగా అడ్డుకున్నట్లు భారత రక్షణ అధికారులు వెల్లడించారు. రష్యాతో చేసుకున్న రక్షణ ఒప్పందంలో భాగంగా.. భారత్‌కు మొత్తంగా 5 ఎస్-400 మిసైల్ సిస్టమ్‌లు అందించాలి. అయితే ఇప్పటివరకు మూడింటిని భారత్ దిగుమతి చేసుకోగా.. మరో 2 అందించాల్సి ఉంది.
అత్యాధునిక ఎస్-400 ను తయారుచేసిన రష్యా ఇప్పుడు ఎస్-500 మిసైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఎస్-500 ప్రోమిథియస్ వ్యవస్థను ఆవిష్కరించేందుకు రష్యా సిద్ధం అవుతోంది. ఈ ఎస్-500 ప్రొమిథియస్.. ప్రపంచ వైమానిక, అంతరిక్ష రక్షణను పునర్నిర్వచించగలదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఎస్-500 అన్ని రకాల ముప్పులను ఎదుర్కొనేందుకు రూపొందించారు. అంతేకాకుండా హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాలు, అధునాతన మానవ రహిత చిన్న వైమానిక విమానాలు, భూ కక్ష్యకు దిగువగా ఉండే శాటిలైట్లను కూడా అడ్డుకునే సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఈ ఎస్-500 క్షిపణి వ్యవస్థ 2 వేల కిలోమీటర్ల వరకు బాలిస్టిక్ లక్ష్యాలను గుర్తించే పరిధిని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఉన్న 200 కిలోమీటర్ల ఎత్తు వరకు టార్గెట్లను ఛేదించగలదు.
కేవలం 3, 4 సెకన్ల సమయంలోనే ఈ ఎస్-500 ప్రతిస్పందిస్తుంది. అంతేకాకుండా 77N6 క్షిపణి వంటి కైనెటిక్ హిట్-టు-కిల్ ఇంటర్‌సెప్టర్‌లతో.. వేగంగా, కచ్చితమైన టార్గెట్లను ఛేదించేలా తయారు చేశారు. ఈ ప్రొమిథియస్.. స్టెల్త్ విమానాలు, అంతరిక్ష ఆధారిత ముప్పులను గుర్తించే జామ్ రెసిస్టెంట్, మల్టీ బ్యాండ్ రాడార్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుత యుద్ధ వాతావరణంలో వ్యూహాత్మకంగా పైచేయి సాధించేందుకు ఉపయోగపడుతుంది.
ఎస్-400 వర్సెస్ ఎస్-500
భారత వైమానిక దళంలో సుదర్శన చక్ర పేరుతో పిలుస్తున్న ఎస్-400 ఒక పటిష్ఠమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా కొనసాగుతోంది. అయినప్పటికీ ఎస్-500 మరింత అడ్వాన్స్‌డ్‌గా పనిచేయనుంది. 600 కిలోమీటర్ల వద్ద లక్ష్యాలను గుర్తించడం, 400 కిలోమీటర్ల దూరం వరకు దాడులను ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ ఎదుర్కొంటుంది. ఇక బాలిస్టిక్ క్షిపణుల కోసం ఎస్-500 దాడుల పరిధిని 600 కిలోమీటర్లకు.. 800 కిలోమీటర్ల వైమానిక లక్ష్యాలను గుర్తించడం కోసం తయారు చేశారు.
ఎస్-400 30 కిలోమీటర్ల వరకు ఎత్తును ఛేదిస్తే.. దాన్ని ఎస్-500లో 200 కిలోమీటర్లకు పెంచారు. ఇక రియాక్షన్ టైమ్ ఎస్-400కు 9 నుంచి 10 సెకన్లు కాగా.. ఎస్-500 కేవలం 3 నుంచి 4 సెకన్లు మాత్రమే. ఇక ఎస్-400 ఒకేసారి 10 లక్ష్యాలను ఎదుర్కొంటే.. ఎస్-500 మాత్రం 36 టార్గెట్లను ట్రాక్ చేస్తుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa