ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వేళ.. దేశంలోని అన్ని పార్టీలు, వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు.. అంతా సపోర్ట్ చేశారు. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో బీజేపీ.. దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేపట్టింది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ కూడా జైహింద్ ర్యాలీ నిర్వహించింది. మరోవైపు.. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా.. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సాయుధ బలగాలకు మద్దతుగా సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా ఏపీలోని పలు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో సర్వ మత ప్రార్థనలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేసి.. దాని ఎమోషనల్ క్యాప్షన్ ఉంచారు.
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో.. జాతీయ భద్రత కోసం జనసేన పార్టీ సర్వమత ప్రార్థనలు నిర్వహించినట్లు జనసేనాని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలిపిందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత్‌కు, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడులోని 6 సుబ్రమణ్య స్వామి ఆలయాలు.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాలు.. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం సహా ఇతర ఆలయాలు.. అదే సమయంలో మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇక ఈ సర్వమత ప్రార్థనల్లో ఏపీ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంత్రి కందుల దుర్గేష్.. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్.. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పత్సమట్ల ధర్మరాజు, పంతం నానాజీ, సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, ఏహెచ్‌యూడీఏ ఛైర్మన్ టీసీ వరుణ్, కేయూడీఏ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సహా పలువురు జనసేన నేతలు పాల్గొన్నట్లు వివరించారు.
భారత దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు.. అదే సమయంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అందరూ సమిష్టిగా నిలబడాలని.. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే భారత దేశపు ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మతాలకు అతీతంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ జనసేనాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |