ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాలిబన్లకు భారత మంత్రి ఫోన్ కాల్..పాక్ టార్గెట్‌గా.. భారత్ అనూహ్య నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 08:13 PM

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ భారత్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ పాలన మొదలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారి వారితో భారత ప్రభుత్వం సంభాషణ ప్రారంభించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం తాలిబాన్ కార్యనిర్వాహక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి‌తో అధికారిక ఫోన్ కాల్‌లో మాట్లాడారు. అఫ్గన్‌ను రెండోసారి తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఇదే మంత్రి స్థాయి సంప్రదింపులు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ భారత్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్.. వారితో సంభాషణ జరిపారు


ఓవైపు. భారత్‌తో ఉద్రిక్తతలు, ఇంకోవైపు అఫ్గన్‌లోని తాలిబన్లతోనూ సఖ్యతలేని పాక్‌కు ఇది ఇబ్బందికరమే. అఫ్గన్ సరిహద్దుల్లో తాలిబన్, పాకిస్థాన్ సైనికుల మధ్య తరుచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ సంభాషణ అనంతరం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన డాక్టర్ జైశంకర్... ‘అఫ్గన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తకితో మంచి సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.. అలాగే అఫ్గన్ ప్రజలతో భారత్‌కు ఉన్న సంప్రదాయ, చారిత్రక మైత్రి, అభివృద్ధి కోసం మేము ఇస్తున్న మద్దతు, భవిష్యత్తులో సహకారాన్ని మరింతగా ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చించాం’‘ అని పేర్కొన్నారు.


పాక్ వ్యూహానికి నో చెప్పి తాలిబన్


పాకిస్థాన్ మీడియా ప్రచారం చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు.. ‘‘భారత్, అఫ్గనిస్థాన్ మధ్య విబేధాలు సృష్టించేలా పాకిస్తాన్ చేసే తప్పుడు ప్రచారాలను తాలిబన్ చేసిన ఖండనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను’’ అని అన్నారు.


చాబహార్ పోర్ట్ ప్రాధాన్యత


తాలిబాన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హఫీజ్ జియా అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం. ఈ కాల్ సందర్భంగా ముత్తకి, భారత ప్రభుత్వం మరిన్ని వీసాలు ముఖ్యంగా వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు మంజూరు చేయాలని అభ్యర్థించారు. అలాగే, ద్వైపాక్షిక వాణిజ్యం, భారత జైలుల్లో ఉన్న అఫ్గన్ ఖైదీల విడుదల, ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధిపై చర్చ జరిగింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో అఫ్గన్, భారత్‌తో వాణిజ్యం కోసం చాబహార్ పోర్ట్‌పై ఆధారపడే పరిస్థితి వచ్చింది.


తాలిబన్‌తో మెరుగైన సంబంధాల దిశగా భారత్


2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తరువాత, భారత్ తన విధానాన్ని మానవతా సహాయం, అభివృద్ధి సహకారంపై దృష్టిపెట్టి ముందుకు తీసుకెళ్లింది. దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటివరకు అనేక సమావేశాలు జరిగాయి. పహల్గామ్ దాడి అనంతరం 2025 ఏప్రిల్ 27న భారత సీనియర్ రాయబారి ఆనంద్ ప్రకాష్ కాబూల్‌ను సందర్శించి ముత్తకి‌తో సమావేశమయ్యారు.


ఇతర కీలక సమావేశాలు


2024లో భారత దౌత్యవేత్త జేపీ సింగ్ రెండుసార్లు అఫ్గానిస్థాన్‌ను సందర్శించి మార్చిలో ముత్తకి‌తో, నవంబరులో తాత్కాలిక రక్షణ మంత్రి ముజాహిద్‌తో సమావేశమయ్యారు. 2025 జనవరిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ దుబాయ్‌లో ముత్తకి‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో సహకారం, మానవతా సహాయం, అభివృద్ధి ప్రాజెక్టులు, వాణిజ్యం, క్రీడలు, సాంస్కృతిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతపై చర్చ జరిగింది.


భారత ప్రభుత్వం తాజాగా, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లోని తాలిబన్ దౌత్య కార్యాలయాల కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించింది. తద్వారా అఫ్గన్ పౌరులకు కాన్సులర్ సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, గతేడాది డిసెంబరు వరకు అఫ్గనిస్థాన్‌కు భారత్ మానవతా సహాయం కింద 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల ఔషధాలు, 27 టన్నుల భూకంప రిలీఫ్ మెటీరియల్, 40,000 లీటర్ల పురుగు మందులు, 100 మిలియన్ పోలియో వ్యాక్సిన్ డోసులు, 1.5 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు, డ్రగ్ డి-అడిక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 11,000 యూనిట్ల హైజీన్ కిట్లు, 500 యూనిట్ల శీతకాల దుస్తులు, 1.2 టన్నుల స్టేషనరీ కిట్లు అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa