ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ఐఎస్ఐ ఏజెంట్‌గా మారిన 52 ఏళ్ల భారత రాయబారి

national |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:14 PM

పాకిస్థాన్‌కు భారత సైనిక రహస్యాలు చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కలకలం రేపుతోంది. అయితే, 15 ఏళ్ల కిందట యావత్తు దేశం ఉలిక్కిపాటుకు గురైన అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. స్వయంగా భారత రాయబారి పాక్ ఏజెంట్‌గా మారిపోయి దేశద్రోహానికి పాల్పడ్డారు. విదేశాంగ శాఖలో పనిచేస్తున్న గ్రేడ్-బి అధికారి మాధురి గుప్తా.. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) హానీట్రాప్‌లో పడి రహస్య సమాచారం చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. భారత గూఢచార వ్యవస్థలో సంచలనం సృష్టించిన అతి తీవ్రమైన దేశద్రోహ ఘటన ఇది. దేశ భద్రతను లోపలి నుంచి కలవరపరిచిన ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది.


26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం దేశ భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఉన్న గ్రేడ్-బి అధికారి గూఢచర్యం గురించి బయటకు రావడంతో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ మాథూర్ అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం ప్రకారం.. హైకమిషన్‌లో ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం రెండో కార్యదర్శిగా మాధురి గుప్తా పనిచేస్తున్న సమయంలో పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్టు గుర్తించారు. ఉర్దూలో పాండిత్యం, సూఫీ కవిత్వం మీద ఆసక్తి వంటివి ఆమెను సాధారణ వ్యక్తిగా కనిపించేలా చేశాయి. కానీ అధికారిక రహస్యాలను లీక్ చేసి దేశభద్రతకు ముప్పు తలపెట్టారు.


నిఘా..యాక్షన్


ఐపీ చీఫ్ రాజీవ్ మాథూర్, రా చీఫ్ కేసీ వర్మ, హోంసెక్రటరీ జీకే పిళ్లైకి సమాచారం అందించి, గుప్తాపై రెండువారాల పాటు నిఘా ఉంచమన్నారు. ఆ సమయంలో ఆమెకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని ఆమె పాక్‌కు చేరవేసినట్టు బయటపడటంతో అనుమానం నిజమైంది. తర్వాత ఆమెను భూటాన్‌లో జరిగే సార్క్ సమ్మిట్‌కు మీడియా సహకారం అందించాలనే వంకతో ఢిల్లీకి పిలిపించారు. దీంతో ఏప్రిల్ 21, 2010న ఆమె ఢిల్లీకి రాగా.. మర్నాడు ఢిల్లీ పోలీసులకు విదేశాంగ అధికారులు అప్పగించారు.


అరెస్ట్- హనీట్రాప్


అధికార రహస్యాల చట్టం కింద 2010 ఏప్రిల్ 22నమాధురి గుప్తాను అరెస్టు చేశారు. ఆమె భారత గూఢచారి అధికారుల సమాచారం బహిర్గతం చేయడం, హైకమిషన్ సిబ్బంది బయో-డేటాలు లీక్ చేయడం వంటి ఆరోపణలతో కేసు నమోదయ్యింది.


భారత దౌత్య అధికారిణి మాధురి గుప్తా హనీట్రాప్‌కు బలయ్యిందని విచారణలో తేల్చారు. జంశేద్ అలియాస్ జిమ్ అనే 30 యువకుడితో ఆమెకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎష్ఐ వలపువల విసిరింది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. కానీ, ఆమె కంటే వయసులో సగం చిన్నవాడైన జిన్.. మాధురిని ప్రేమగా మోసగించి, రహస్యాలను సేకరించినట్టు నిర్దారణ అయ్యింది. ఈ మొత్తం వ్యవహారం అప్పటి పాకిస్థాన్ మంత్రి రెహమాన్ మలిక్‌కి సన్నిహితుడు, ఉన్నతాధికారి అయిన ముదస్సర్ రజా రానా నడిపించినట్టు సమాచారం. మొదట ఆమెను ఒక మహిళా జర్నలిస్ట్ ద్వారా సంప్రదించి, మౌలానా మసూద్ అజహర్ రచించిన ఓ పుస్తకాన్ని ఇచ్చిఆమెకు నమ్మకం కలిగించారు. ఇస్లామాబాద్ నివాసంలో కంప్యూటర్, బ్లాక్‌బెర్రీ ఫోన్ ద్వారా ఈ వ్యక్తులతో గుప్తా తరుచూ సంప్రదింపులు సాగించినట్టు ఆధారాలు లభించాయి.


ఇ-మెయిల్ ఆధారాలు


పాక్ ఏజెంట్లు ఆమె కోసం రూపొందించిన lastrao@gmail.com, arao@gmail.com అనే ఇమెయిల్ ఐడీలలో ఆమె సుమారు 73 మెయిల్స్ పంపినట్టు చార్జ్‌షీట్‌లో ఉంది. అంతేగాక, ఇస్లాం స్వీకరించి జంశేద్‌ని వివాహం చేసుకోవాలని, ఇద్దరూ ఇస్తాంబుల్ వెళ్లాలని ఆమె ఆలోచనలుగా బహిర్గతమయ్యాయి. అయితే, 2012లో మాధురి గుప్తాపై అధికారికంగా కేసు నమోదు చేశారు. తిహార్ జైలులో 21 నెలలు గడిపిన తర్వాత బెయిలు వచ్చింది. 2018లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. అయితే, చివరకు 2021 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని భివాండిలో ఆమె చనిపోయారు. ఆ సమయానికి ఆమె అప్పీల్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే, ఈ కేసు తర్వాత విదేశీ మిషన్లలో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను కఠినతరం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa