ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను పెళ్లిచేసుకో? ఐఎస్ఐ హ్యాండర్లకు యూట్యూబర్ జ్యోతి రిక్వెస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:18 PM

గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కళ్లుబైర్లుకమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న ఆమె.. విచారణలో కీలక సమాచారం వెల్లడించినట్టు తెలుస్తోంది. వీటిలో, పాకిస్థానీ గూఢచారి అధికారి, జ్యోతి మల్హోత్రా మధ్య సాగిన సంభాషణల వివరాలు బయటపడినట్టు సమాచారం. ఈ సంభాషణలు మల్హోత్రాకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు మరింత బలమైన ఆధారాలను సూచిస్తున్నాయి. 'ట్రావెల్ విత్ జో' అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI)లో పనిచేసే అలీ హసన్ అనే వ్యక్తితో నిరంతరంగా ఆమె టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారంటూ అధికారులు చెబుతున్నారు.


యూట్యూబర్ మల్హోత్రా.. హసన్ మధ్య వాట్సాప్ సంభాషణలు పోలీసులకు లభించాయి. ఒక సంభాషణలో మల్హోత్రా, ‘పాకిస్థాన్‌లో నన్ను పెళ్లి చేసుకో" అని చెప్పినట్టు తెలిసింది. ఇది ఆమెకు పాక్‌ పట్ల భావోద్వేగ సంబంధం ఉందనడానికి సూచనగా భావిస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ చాట్‌లలో భారతదేశంలో గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించిన సంకేత భాషలలో సంభాషణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.


దర్యాప్తులో భాగంగా మల్హోత్రాకు చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాల సమాచారం లభించిందని పోలీసులు తెలిపారు. వాటిలో ఒక ఖాతాలో దుబాయ్ నుంచి లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఆమెకు ఎక్కడి నుంచి నగదు వచ్చిందో గుర్తించేందుకు అన్ని ఖాతాలను దర్యాప్తు ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలొవర్స్ ఉన్న మల్హోత్రా.. పాకిస్థాన్‌లో రెండు మార్లు పర్యటించారు. ఆ సమయంలో ఆమె ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేసే రహీమ్ అనే అధికారిని కలిశారు. ఆయనే తరువాత ఆమెను ఐఎస్ఐఏ ఏజెంట్లకు పరిచయం చేశారని సమాచారం.


భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె పాకిస్థానీ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించినట్టు, భారత సైనికుల కదలికల వారు అడిగిన సమాచారం ఆమె అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తొలుత ఆమె తండ్రి,.. వీడియోలు తీయడానికి పాకిస్థాన్‌కు వెళ్లిందని చెప్పినప్పటికీ తర్వాత మాట మార్చారు. జ్యోతి మల్హోత్రా ఢిల్లీకి వెళ్తున్నట్టు తనకు చెప్పిందని, పాక్ వెళ్లినట్టు తెలియదని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదికి గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై పది మందికిపైగా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. వీరిలో ఒక విద్యార్థి, ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక వ్యాపారి ఉన్నారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే. ఉగ్రదాడికి కొద్ది నెలల ముందే జ్యోతి మల్హోత్రా పహల్గామ్‌కు వెళ్లి వీడియోలు తీసినట్టు గుర్తించారు. అంతేకాదు, దాడి సమయంలో ఆమె పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు తెలిసింది.


కాగా, జ్యోతి కేసుపై హిసార్ ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక యుద్ధం సరిహద్దులో మాత్రమే జరగదని అన్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తమ కథనాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను నియమించుకుంటున్నారని తాము గుర్తించినట్లు ఆయన చెప్పారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa