గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఇన్ఫెక్షన్ల తీవ్రత సాధారణంగానే, తేలికపాటిదిగానే ఉందని.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ సోమవారం స్పష్టం చేశారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. వైరస్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ కొత్త వేరియంట్లు తీవ్రమైనవి కావని.. అవి ఒమిక్రాన్ సబ్ వేరియంట్లేనని చూపించినట్లు తెలిపారు. ఈ వేరియంట్లు ఎల్ఎఫ్ 7, ఎక్స్ఎఫ్‌జీ, జేఎన్ 1, ఎన్‌బీ.1.8.1 అని.. వీటిలో మొదటి 3 ఎక్కువగా వ్యాప్తి ఉన్నాయని డాక్టర్ రాజీవ్ బెహ్ల్ వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి నమూనాలను సీక్వెన్స్ చేస్తున్నారని.. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని వేరియంట్లు ఉన్నాయో లేదో తెలుస్తుందని తెలిపారు.
ఐసీఎంఆర్ డీజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేసుల సంఖ్య తొలుత దక్షిణం నుంచి.. ఆపై పశ్చిమం నుంచి మరియు ఇప్పుడు ఉత్తర భారత్ నుంచి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ కేసులన్నీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా పర్యవేక్షించబడుతున్నాయని వివరించారు. అదనంగా దేశవ్యాప్తంగా ఐఎంసీఆర్ ఆధ్వర్యంలోని శ్వాసకోశ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్‌వర్క్.. కొత్తగా వస్తున్న ఇన్ఫెక్షన్లు, వ్యాధికారకాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. కరోనా కేసులు పెరిగినప్పుడు.. 3 విషయాలను పరీక్షిస్తామని డాక్టర్ రాజీవ్ బెహ్ల్ చేశారు. ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుంది.. అంటే కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయి అనేది మొదటి అంశమని.. గతంలో కొవిడ్ కేసులు 2 రోజుల్లో రెట్టింపు కావడం చూశామని.. కానీ ఈసారి కేసులు అంత వేగంగా పెరగడం లేదని అన్నారు.
కొత్తగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్ వేరియంట్లు గత రోగనిరోధక శక్తిని తప్పించుకుంటున్నాయా అనే ప్రశ్నకు ఐసీఎంఆర్ డీజీ స్పందించారు. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు, అవి సహజ రోగనిరోధక శక్తి లేదా వ్యాక్సిన్ నుంచి వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకుంటాయని.. కానీ ప్రస్తుతానికి ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మూడో అంశం ఏంటంటే కొవిడ్ కేసుల్లో తీవ్రమైన కేసుల శాతమని ఆయన అన్నారు. ప్రస్తుతానికి తీవ్రత సాధారణంగా తక్కువగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మనం అప్రమత్తంగా ఉండాలని.. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని డాక్టర్ బెహ్ల్ వెల్లడించారు.
ఆదివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశానికి తాను, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ హాజరైనట్లు డాక్టర్ బెహ్ల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని.. అప్రమత్తంగా ఉండాలి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతానికి అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ డేటాబేస్ కొత్త వేరియంట్లు తీవ్రమైన వ్యాధిని కలిగించడం లేదని చూపుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. సాధారణ జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు.
బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉందా ఐసీఎంఆర్ డీజీని అడగ్గా.. ప్రస్తుతానికి టీకా అవసరం లేదని తేల్చి చెప్పారు. భారత్‌కు టీకాలు తయారుచేసే సామర్థ్యం ఉందని.. అవసరమైతే అతి తక్కువ సమయంలో ఏదైనా టీకాను తయారుచేయగలమని వెల్లడించారు. మే నెల నాటికి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎల్ఎఫ్ 7, ఎన్‌బీ.1.8 సబ్-వేరియంట్‌లను "వేరియంట్స్ అండర్ మానిటరింగ్" (పరిశీలనలో ఉన్న వేరియంట్లు)గా వర్గీకరించింది. "వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్" (ఆందోళన కలిగించే వేరియంట్లు) లేదా "వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్" (ఆసక్తి కలిగించే వేరియంట్లు)గా కాదని వెల్లడించింది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరగడానికి ఈ వేరియంట్‌లే కారణమని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa