ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన 'పూరి మ్యూజింగ్స్' కార్యక్రమం ద్వారా పలు ఆసక్తికర అంశాలపై తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 'మోస్ట్ వాంటెడ్' పేరుతో, అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చివరి జీవితానికి సంబంధించిన పలు ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. వేలాది మంది అమాయకుల మరణానికి, సెప్టెంబర్ 11 దాడులకు ప్రధాన సూత్రధారి అయిన లాడెన్, తన చివరి పదేళ్లు తీవ్ర భయాందోళనలు, కష్టాల నడుమ గడిపాడని పూరి తెలిపారు.పాకిస్థాన్‌లోని స్వాత్ వ్యాలీలో పోలీసులు ఓ కారును ఆపినప్పుడు, అందులో ఉన్నది బిన్ లాడెన్ అని వారికి తెలియలేదని, ఆనాడు పట్టుబడకుండా తప్పించుకున్న లాడెన్, లేకపోతే పదేళ్ల ముందే దొరికేవాడని పూరి అన్నారు. అనంతరం స్వాత్ వ్యాలీ, పెషావర్, హరిపూర్ మీదుగా చివరకు అబోట్టాబాద్‌లోని 'వజీరిస్థాన్ హవేలీ' అనే ఇంట్లో లాడెన్ స్థిరపడ్డాడని వివరించారు. ఈ ఇంటిని అత్యంత పకడ్బందీగా, చుట్టూ 12 నుంచి 18 అడుగుల ఎత్తైన గోడలతో, మూడంతస్తుల భవనంగా నిర్మించుకున్నాడని తెలిపారు. తన ముగ్గురు భార్యలు, 8 మంది పిల్లలు, ఐదుగురు మనవళ్లతో కలిసి లాడెన్ అక్కడే నివసించాడని చెప్పారు.పూరి వెల్లడించిన వివరాల ప్రకారం, లాడెన్ ఎక్కువగా తన చిన్న భార్యతో రెండవ, మూడవ అంతస్తులలో గడిపేవాడు. ఆ ఇంటికి టెలిఫోన్ గానీ, ఇంటర్నెట్ కనెక్షన్ గానీ లేవు. చెత్తను కూడా ఇంట్లోనే కాల్చేస్తూ, బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా అత్యంత రహస్యంగా జీవించాడు. ఆ ఇంట్లో ఎవరు నివసిస్తున్నారనే విషయం చుట్టుపక్కల వారికి కూడా తెలిసేది కాదని పూరి పేర్కొన్నారు. లాడెన్ వద్ద కేవలం నాలుగు జతల బట్టలు, ఒక జాకెట్, రెండు స్వెటర్లు మాత్రమే ఉండేవని, దాదాపు తొమ్మిదేళ్ల పాటు అక్కడే అజ్ఞాత జీవితం గడిపాడని తెలిపారు. స్పై శాటిలైట్ల కంట పడకుండా ఉండేందుకు, బయటకు వచ్చిన ప్రతిసారీ కౌబాయ్ టోపీ పెట్టుకుని కాంపౌండ్‌లో తిరిగేవాడని చెప్పారు. అతని నమ్మకస్తులైన అబు అహ్మద్ అల్ కువైటీ, అతని స్నేహితుడు అబ్రార్ మాత్రమే లాడెన్‌కు బయటి ప్రపంచంతో సంధానకర్తలుగా వ్యవహరించేవారని, ఇంటి అవసరాలు కూడా వారే చూసుకునేవారని పూరి వివరించారు.ఆ ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండించుకుంటూ, కుందేళ్లు, కోళ్లను పెంచుకుంటూ లాడెన్ కాలం గడిపేవాడని పూరి తెలిపారు. తన మనవళ్లతో మొక్కలు నాటించి, ఎవరి మొక్క పెద్దగా పెరిగితే వారికి బహుమతులు ఇస్తానని పోటీలు కూడా పెట్టేవాడట. రహస్యంగా ఏర్పాటు చేసుకున్న శాటిలైట్ డిష్ ద్వారా టీవీ చూసేవాడని, తన గురించి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఏం మాట్లాడుతున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడని అన్నారు. ఆశ్చర్యకరంగా, లాడెన్ ఎక్కువగా 'టామ్ అండ్ జెర్రీ' యానిమేటెడ్ సినిమాలు చూసేవాడని, స్వీట్లు, చాక్లెట్లు అంటే కూడా చాలా ఇష్టపడేవాడని పూరి వెల్లడించారు.ఒకసారి తన భార్య ప్రసవ సమయంలో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని పూరి తెలిపారు. మారువేషంలో వెళ్లిన లాడెన్, తన భార్య మూగ, చెవిటిదని డాక్టర్‌కు అబద్ధం చెప్పాడని, దాంతో వైద్యులు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని చెప్పారు. ఆ రోజు ఆసుపత్రిలో అమాయకంగా కూర్చున్న లాడెన్‌ను ఎవరూ గుర్తుపట్టలేకపోయారని అన్నారు.అల్‌ఖైదా కార్యకలాపాల గురించి లాడెన్ చెబుతుంటే, కూతుళ్లు కాగితంపై రాసేవారని పూరి వివరించారు. ఆ సమయంలో అల్‌ఖైదా బలహీనపడటం, ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వంటి విషయాలపై లాడెన్ తీవ్రంగా మధనపడేవాడని, ఒక దశలో అల్‌ఖైదా పేరు మార్చాలని కూడా ఆలోచించాడని తెలిపారు. తన పిల్లలు, మనవళ్లు స్కూల్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో, తానే వారికి పాఠాలు చెప్పేవాడని అన్నారు. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ ఉండేదని, ఏదైనా సమాచారం చేరవేయాలంటే యూఎస్బీ డ్రైవ్‌లను వాడేవాడని చెప్పారు .ఏళ్ల తరబడి అదే ఇంట్లో అనుక్షణం భయంతోనే లాడెన్ బతికాడని పూరి పేర్కొన్నారు. రోజంతా ఏం చేయాలో తెలియక, తన దగ్గరున్న వీడియో కెమెరాతో కోళ్లు, మొక్కలు, అప్పుడప్పుడు ఇంటిపై నుంచి వెళ్లే హెలికాప్టర్ల దృశ్యాలను రికార్డు చేసేవాడని తెలిపారు. పక్కనే పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటంతో, ఏ హెలికాప్టర్ శబ్దం విన్నా భయపడేవాడని వివరించారు.అమెరికా నేవీ సీల్ టీమ్ ఆ ఇంట్లోకి చొరబడి లాడెన్‌ను హతమార్చిన తర్వాత, అక్కడి కంప్యూటర్ నుంచి సుమారు 4 లక్షల 70 వేల ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాయని పూరి తెలిపారు. వాటిలో అశ్లీల చిత్రాలు కూడా లభించాయని, అలాగే నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఎలా హత్య చేయాలనే ప్రణాళికలు కూడా సీల్ టీమ్‌కు దొరికాయని చెప్పారు.ఎన్నో వేల మంది చావులకు, సెప్టెంబర్ 11 దాడులకు కారణమైన బిన్ లాడెన్, తన చివరి పదేళ్లు ఇలా కష్టాలు పడుతూ, నిరంతర భయంతో బతికాడని పూరి జగన్నాథ్ తన 'పూరి మ్యూజింగ్స్'లో వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa