ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలసదారుల నిర్బంధానికి వ్యతిరేకంగా నిరసనలు.. రణరంగంగా లాస్ ఏంజిల్స్

international |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 07:54 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్స్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతంగా మారాయి. మూడు రోజులుగా నగరంలో ఇమ్మిగ్రేషన్ దాడులు, అరెస్టులు, సెంట్రల్ అమెరికన్ వలసదారులపై చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100కి పైగా అరెస్ట్ చేయగా.. యూనియన్ నాయకులు కూడా అరెస్టు అయ్యారు. పరామౌంట్, కాంప్టన్ వంటి ప్రాంతాల్లో కూడా ఆందోళనలు వ్యాపించాయి. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో నేషనల్ గార్డ్ దళాలను లాస్ ఏంజిల్స్‌‌లో మోహరించడంతో రణరంగాన్ని తలపిస్తోంది. వేలాదిగా నిరసనకారులు రహదారులను దిగ్బంధించి.. పోలీసు వాహనాలకు నిప్పంటించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాంగ్‌లను ప్రయోగిస్తున్నారు.వలసదారుల తరలింపుపై ట్రంప్ ఉత్తర్వులనుసవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా అక్రమవలసదారులను అరెస్ట్ చేస్తున్నారు.


శుక్రవారం అదుపులోకి తీసుకున్న అక్రమవలసదారులను ఉంచిన మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ వద్ద నేషనల్ గార్డులతో భారీ భద్రత ఏర్పాటుచేశారు. అయితే, అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ. నేషనల్ గార్డ్ దళాలను చుట్టుముట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. మరోవైపు, ట్రంప్‌కి లేఖరాసిన కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్... నేషనల్ గార్డ్ దళాలను వెనక్కి పిలిపించాలని కోరారు. ‘ఇది రాష్ట్రాధికారంపై తీవ్రమైన దాడి.. లాస్ ఏంజిల్స్‌లో ఈ ఉద్రిక్తతలకు ఫెడరల్ ప్రభుత్వమే కారణం’ అని న్యూసమ్ విమర్శించారు.


అటు, ఆందోళనకారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్లు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశాన్ని చీల్చే కుట్రలను అనుమతించబోం.. కావాలంటే మరిన్ని దళాలు పంపుతాంై అని హెచ్చరించారు. ‘ఇమ్మిగ్రేషన్‌ను అడ్డుకునే స్థానిక అధికారులు కూడా శిక్షార్హులే’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అక్రమవలసదారులు వెంటనే అమెరికా విడిచివెళ్లాలని, లేకుంటే రోజుకు 1000 డాలర్లు జరిమానా వేస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.


అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, ట్వెంటీ నైన్ పామ్స్ వద్ద 500 మెరైన్స్‌ను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ‘హింస కొనసాగితే, మేము యాక్టివ్-డ్యూటీ మెరైన్స్‌ను కూడా పంపుతాం’ అని హెచ్చరించారు. ట్రంప్ తీరుపై ప్రతిపక్ష డెమొక్రాట్లు మండిపడుతున్నారు. సెనేటర్ బెర్నీ రాండర్స్ ‘ఇది అమెరికాలో అధికారవాదాన్ని ప్రవేశపెడుతున్న చర్య’ అని ఆరోపించారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. ‘ఇది దారుణమైన, ఉద్దేశపూర్వకమైన కుట్ర. ప్రజలను భయపెట్టడం లక్ష్యం’ అని మండిపడ్డారు. అయితే, స్పీకర్ మైక్ జాన్సన్ మాత్రం ట్రంప్‌ను సమర్దించారు. ఆయన సరైన పని చేశారని, కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ కర్తవ్యం విస్మరించారని దుయ్యబట్టారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, అక్రవ వలసవాదుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తోన్న తీరుపై స్వదేశంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa