ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి విధానం, నిర్ణయం వెనుక 'ఇండియా ఫస్ట్‌'.. మోదీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 02:45 PM

మా ప్రతి విధానం వెనుకా ఇదే నినాదం 811ఏళ్లలో అన్ని రంగాల్లో శీఘ్ర పరివర్తనం సమష్టి విజయాలకు గర్విస్తున్నాం: మోదీ  తన ప్రభుత్వ ఆధ్వర్యంలో గత 11 ఏళ్లలో భారత్‌ అతి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే గాక.. వాతావరణ మార్పులు, డిజిటల్‌ ఇన్నొవేషన్‌లో అంతర్జాతీయంగా కీలక గొంతుకగా మారిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రతి విధానం, నిర్ణయం వెనుక 'ఇండియా ఫస్ట్‌' చోదక శక్తిగా ఉందన్నారు. 'సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌..' ఎన్‌డీఏ ప్రభుత్వ మార్గదర్శక సూత్రంగా పేర్కొన్నారు. దీనిద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రధాని పగ్గాలు చేపట్టి 11 ఏళ్లు.. మూడోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. '11 ఏళ్ల సేవలో' అనే హ్యాష్‌టాగ్‌ జోడించారు. ఈ 11 ఏళ్లలో సత్పరిపాలన, పరివర్తనపై దృష్టి కేంద్రీకరించామన్నారు. 140 కోట్ల మంది సమష్టి భాగస్వామ్యం, ఆశీర్వాదంతో వివిధ రంగాల్లో శీఘ్ర అభివృద్ధి, ఎంతో పరివర్తన చోటుచేసుకున్నాయని తెలిపారు. బడుగు వర్గాలకు ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం లేదని, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా తన ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయని.. కానీ తన మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చోటు కల్పించామన్నారు. సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ వర్గాలకు గతంలో ఎప్పుడూ ఇంత ప్రాతినిధ్యం లేదన్నారు. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సాధికారత వరకు ప్రభుత్వ కృషి మొత్తం ప్రజలే కేంద్రకంగా, సర్వతోముఖాభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. ఈ సమష్టి విజయానికి గర్విస్తున్నామని.. ఇదే సమయంలో వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మొక్కవోని సంకల్పం తీసుకున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో తెచ్చిన మార్పులను వివరించే సమాచారంతో కొన్ని లింకులను ఆయన పోస్టుచేశారు. 'పురోగామి రాజకీయాలను తీసుకొచ్చాం. వికాసవాదాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చాం. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. 15 కోట్ల ఇళ్లకు కొళాయి కనెకన్లు ఇచ్చాం. 4 కోట్ల మందికిపైగా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చాం. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. 68 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాం. కొవిడ్‌ సమయంలో వివిధ పథకాల కింద 20 కోట్ల మంది మహిళలకు నగదు సాయం అందించాం' అని వివరించారు. సువర్ణాక్షరాలతో లిఖిస్తారు: నడ్డా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సానుకూల మార్పులకు గాను దాని 11 ఏళ్ల పాలనను చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాహుల్‌గాంధీ బాధ్యతారహిత విపక్ష నేత అని మండిపడ్డారు. పహల్గాం దాడి దరిమిలా నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరై.. ప్రభుత్వం వెంటే ఉంటామని చెప్పారని.. తీరా బయటకు వెళ్లాక బాధ్యత లేకుండా మాట్లాడారని... విదేశాంగ విధానం.. ఆపరేషన్‌ సిందూర్‌లో ఎన్ని యుద్ధవిమానాలు నష్టపోయామంటూ నిరాధార ప్రశ్నలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. క్రికెట్‌ మ్యాచ్‌లో ఓటమికి ఆటగాళ్లు అంపైర్‌ను నిందించినట్లుగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఆయనకు భగవంతుడు సద్బుద్ధి ప్రస్తాదిస్తాడన్న ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం ఢిల్లీలో నడ్డా విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ సర్కారు విజయాలను వివరించారు. 'యూపీఏ పదేళ్ల హయాంలో జరిగిన స్కాంలు, విభజన, బుజ్జగింపు రాజకీయాలు, నకారాత్మకతకు మోదీ స్వస్తి పలికారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూనే ప్రభుత్వాన్ని జవాబుదారీగా, స్పందించే విధంగా మలిచారు' అని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఐదేళ్లు మాత్రమే గాక.. వచ్చే ఐదేళ్లూ పాలన సాగిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. స్వర్ణయుగం: అమిత్‌షా 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం.. ప్రజాసేవలో అంకితభావం, సంకల్పం, కృషికి స్వర్ణయుగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభివర్ణించారు. మోదీ మూడో టెర్మ్‌లో నవభారతం అభివృద్ధి, స్వావలంబన దిశగా వేగంగా పురోగమిస్తోందని 'ఎక్స్‌'లో తెలిపారు. భారతీయుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం ద్వారా భారత్‌ను ప్రతి రంగంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దే కృషి కొనసాగుతుందన్నారు. గత 11 ఏళ్ల సేవలో 'కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన'తో దేశాభివృద్ధి వేగం, పరిమాణాన్ని మోదీ ప్రభుత్వం మార్చివేసిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa