ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' చేపట్టిన ఇజ్రాయెల్ ఇరాన్ ఆర్మీ చీఫ్ సహా పలువురు కీలక సైనికాధికారుల మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 06:19 PM

ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో జరిపిన భీకర దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు అత్యున్నత సైనికాధికారులు, కీలక అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది.శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్'ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్‌ వ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఇరాన్ ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రమైన నతాన్జ్‌లో పలు భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వర్గాలు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరగవచ్చనే ఆందోళనతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి, తమ సైనిక బలగాలను మోహరించింది.ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ హొస్సేన్ సలామీ మరణించారు. 2019లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేత నియమితుడైన సలామీ, టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.ఈ దాడుల్లో మరణించిన వారిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరి కూడా ఉన్నారు. సైనిక అధికార క్రమంలో సుప్రీం లీడర్ తర్వాత బఘేరి రెండవ స్థానంలో ఉండేవారు. మరో కీలక వ్యక్తి, ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి నేతృత్వం వహిస్తున్న జనరల్ ఘోలం అలీ రషీద్ కూడా ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం. సుప్రీం లీడర్ సలహాదారు, ఐఆర్‌జీసీ మాజీ కమాండర్ అలీ షమ్ఖానీ ఈ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ స్థానిక వార్తా సంస్థలు నివేదించాయి.ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు మరణించారు. వారిలో అబ్దొల్‌హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్‌రెజా జోల్ఫాఘరీ, అమీర్‌హొస్సేన్ ఫెక్హీ, మొతాలెబ్లిజాదే, మొహమ్మద్ మెహదీ తెహ్రాంచీ, ఫెరీడౌన్ అబ్బాసీ ఉన్నారు.వేల కిలోమీటర్ల ఆవల నుంచి కూడా ఇజ్రాయెల్ గురితప్పకుండా లక్ష్యాలను ఛేదించిన తీరు అచ్చెరువొందిస్తోంది. అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న సైనికాధికారులు, సైంటిస్టులను అత్యంత కచ్చితత్వంతో హతమార్చినట్టు తెలుస్తోంది. అదే అపార్ట్ మెంట్లలో సాధారణ పౌరులు కూడా ఉంటున్నప్పటికీ, వారికి ఎలాంటి హాని జరగకుండా, టార్గెట్లను ఫినిష్ చేయడం ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీకి అద్దం పడుతోంది. ఈ మేరకు కొన్ని ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ దుర్మార్గమైన, రక్తపాత చర్యలకు పాల్పడిందని, ఇరాన్‌పై జరిగిన ఈ నేరానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.ఈ దాడుల నేపథ్యంలో తక్షణ అంతర్జాతీయ స్పందనలు వెల్లువెత్తాయి. పలు విమానయాన సంస్థలు ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ గగనతలాలపై విమాన సర్వీసులను దారి మళ్లించాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa