మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటిలో ట్యాక్సీలు బుక్ చేసుకుంటాం. అయితే ఒక్కరమే ఉంటే.. బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తాం. ఇలా ఒక్కరే ఉన్నపుడు బైక్ ట్యాక్సీల్లో వెళ్తే.. ట్రాఫిక్‌లో సమయం ఆదా కావడమే కాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. చాలా నగరాల్లో నిత్యం బైక్ ట్యాక్సీల్లో లక్షలాది మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి పెద్ద షాక్ తగలనుంది. బైకులను కమర్షియల్ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌గా ఉపయోగించవద్దని.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె సంచలన నిర్ణయం తీసుకుని.. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలకు పెద్ద షాక్ తగిలింది. దీంతో బైక్ ట్యాక్సీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో కర్ణాటకలో జూన్ 16 వ తేదీ నుంచి బైక్ ట్యాక్సీలపై పూర్తి నిషేధం అమలు కానుంది.
సిద్ధరామయ్య ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై విధించిన ఈ నిషేధాన్ని నిలిపివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీంతో రాపిడో, ఉబర్ మోటో వంటి సంస్థలకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఉన్న రవాణా శాఖ నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనాలను వాణిజ్య ప్రయాణికుల రవాణాకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని చేసిన వాదనను కోర్టు సమర్థించింది. రూల్స్ ప్రకారం.. బైక్‌లను ప్రయాణికుల రవాణాకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని కర్ణాటక రవాణా శాఖ గతంలోనే నోటీసులు జారీ చేసింది. కమర్షియల్‌గా రిజిస్టర్ చేసిన, సరైన అనుమతులు కలిగి ఉన్నన వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా ప్రయాణికులను తరలించడానికి చట్టబద్ధంగా ఉపయోగించవచ్చని రవాణా శాఖ వాదించగా.. ఆ వాదనను హైకోర్టు సమర్థించింది.
అయితే కర్ణాటక బైక్ ట్యాక్సీల్లో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రాపిడో.. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఈ నిషేధ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేసి.. దీనిపై స్టే పొందాలని భావించింది. కనీసం తాత్కాలికంగా ఉపశమనం కల్పించడానికి కూడా హైకోర్టు నిరాకరించడంతో.. జూన్ 16వ తేదీ నుంచి కర్ణాటక వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ ఉత్తర్వులను కాదని బైక్ ట్యాక్సీలు నడిపిస్తే.. చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం, హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ర్యాపిడో, ఉబర్ మోటో వంటి అనేక యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సేవలపై ప్రభావం పడనుంది. బెంగళూరు వంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో వేగంగా, తక్కువ ధరలో ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ఈ బైక్ ట్యాక్సీలు నమ్ముకునే లక్షలాది మంది రోజువారీ ప్రయాణాలు చేస్తున్నారు. తాజా నిషేధంతో వారంతా ఇప్పుడు తీవ్ర గందరగోళంలో పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa