కేవలం లక్ష రూపాయల విలువైన స్కూటీకి.. ఏకంగా పద్నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఒక వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొనుగోలు చేసి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రికార్డు సృష్టించారు. సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ వేలంలో ఈ అద్భుతమైన ధరను వెచ్చించి 'హెచ్‌పీ21సి-0001' (HP21C-0001) నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. వాహనం ధర కంటే పదిహేను రెట్లు ఎక్కువ మొత్తాన్ని కేవలం నంబర్ ప్లేట్‌కే ఖర్చు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వినూత్న వేలం హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగింది. ఆశ్చర్యకరంగా ఈ కీలకమైన వీఐపీ నంబర్ కోసం కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పోటీ పడ్డారు. సోలన్ జిల్లాలోని బడ్డీకి చెందిన మరో బిడ్డర్.. ఈ నంబర్ కోసం రూ. 13.5 లక్షలు కోట్ చేశారు. అయితే సంజీవ్ కుమార్ అతనిని అధిగమించి అంతకంటే రూ.50 వేలు ఎక్కువగా పాడారు. ముఖ్యంగా రూ. 14 లక్షలకు ఈ ప్రతిష్టాత్మక నంబర్‌ను దక్కించుకున్నారు.
రవాణా శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర చరిత్రలోనే ఒక ద్విచక్ర వాహనానికి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. సంజీవ్ కుమార్ చేసిన ఈ కొనుగోలు.. కేవలం ఒక నంబర్ ప్లేట్‌కు భారీ ధర చెల్లించడమే కాకుండా, పెరుగుతున్న జీవనశైలి మార్పులు, డిజిటల్ వేలం ప్రక్రియల పారదర్శకతపై కూడా చర్చకు తెర లేపింది. ప్రజలు తమ వాహనాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే వీఐపీ నంబర్‌లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తుంది.
కొంతమందికి వాహనం ధర ముఖ్యం కాగా.. మరికొంతమందికి వాహనం కంటే దాని నంబర్ ప్లేట్‌కే ఎక్కువ విలువ ఇస్తారని ఈ ఘటన రుజువు చేసింది. లక్ష రూపాయల స్కూటీకి 14 లక్షల నంబర్ ప్లేట్ అంటే మొత్తం వాహనం ధర కంటే 15 రెట్లు అధికం కావడం విశేషం. సంజీవ్ కుమార్ తన ఈ ప్రత్యేక నంబర్‌తో రోడ్లపైకి రాగానే అందరి దృష్టినీ ఆకర్షించడం ఖాయం. మరోవైపు ఈ వార్త తెలుసుకున్న నెటిజెన్లు షాక్ అవుతున్నారు. రూ.14 లక్షలతో మంచి లగ్జరీ కారే వచ్చేది కదా.. ఈ నంబర్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్ష రూపాయల స్కూటీ కోసం 14 లక్షలు ఖర్చు చేశారంటే.. మీరు ధనవంతులే అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa