ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ కాల్ లీక్.. అధికారం చేపట్టిన 10 నెలలకే పీఎంకు పదవీగండం

international |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 07:38 PM

ఒకే ఒక్క ఫోన్ కాల్.. థాయ్‌లాండ్ దేశ రాజకీయాన్నే కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈదేశ యువ ప్రధాని పాటోంగ్‌టార్న్ షినావత్రాకు సంబంధించిన ఒక వ్యక్తిగత సంభాషణ బయటకు రావడంతో ఆమె ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పక్క దేశ మాజీ ప్రధానితో ఆమె మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో.. అధికార పదవి చేపట్టిన 10 నెలలకే ఆమె పదవికే గండం ఏర్పడింది. ప్రస్తుతం ఈ అంశం థాయ్‌లాండ్ ప్రజలతో పాటు అంతర్జాతీయ వ్యాప్తంగా ఆసక్తిని కల్గజేస్తోంది. అసలీ ఫోన్ కాల్ ఏంటి, పదివే పోయేంత స్థాయిలో ఆమె ఏం మాట్లాడారు, దాన్ని ఎవరు లీక్ చేశారు వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


థాయ్‌లాండ్ దేశానికి పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్ 2023 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్‌ మానెట్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పదవిలో లేకపోయినప్పటికీ.. కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్‌సేన్. ఇటీవలే ఈయనకు థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. అంకుల్ అని సంబోధిస్తూ.. తన దేశ పరిస్థితుల గురించి వివరించారు. ముఖ్యంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది.


సాధారణంగానే థాయ్‌లాండ్-కంబోడియా దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండగా.. ఈమధ్య సరిహద్దు వివాదాలతో అవి మరింతగా దెబ్బతిన్నాయి. ఈ తరుణంలోనే ప్రధాని పొరుగుదేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. లీకైన సంభాషణలో థాయ్ యువ ప్రధాని షినావత్రా.. తమ దేశ సైన్యాధికారిని తన 'ప్రత్యర్థి'గా పేర్కొన్నట్లు ఉండగా.. అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైనిక జోక్యం చరిత్ర కలిగిన థాయ్‌లాండ్‌లో.. ప్రధాని నోటి వెంట ఇలాంటి వ్యాఖ్య రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు బయట పడగానే దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. దీంతో ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఆమెను వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు చేస్తున్నారు.


ఈ వివాదం కేవలం ప్రజా వ్యతిరేకతకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రభుత్వ స్థిరత్వంపైనే తీవ్రమైన ప్రభావం చూపింది. పరిస్థితి ఎంత జఠిలమైందంటే.. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న భూమ్‌జైథాయ్ పార్టీ కూటమి నుంచి పూర్తిగా వైదొలిగింది. ఈ అనూహ్య పరిణామంతో పార్లమెంట్‌లో ప్రధాని షినావత్రాకు కేవలం అత్యల్ప మెజారిటీ మాత్రమే మిగిలింది. ఇది ఆమె ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఏ క్షణమైనా నమ్మకాన్ని కోల్పోయి ప్రభుత్వాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.


ఈ రాజకీయ సంక్షోభం థాయ్‌లాండ్‌లో అకస్మిక ఎన్నికలకు దారితీయవచ్చని లేదా అంతకు మించి సైనిక తిరుగుబాటుకు (coup) కూడా దారి తీయవచ్చని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో థాయ్‌లాండ్‌లో పలుమార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ప్రధాని షినావత్రా ఈ లీకేజీ వ్యవహారంపై క్షమాపణలు చెప్పినప్పటికీ.. పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఒక చిన్న ఫోన్ కాల్ లీకేజీ, ఒక దేశ రాజకీయ భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన నిరూపిస్తుంది. థాయ్‌లాండ్ రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత ఉత్కంఠభరితంగా, ఊహించని మలుపులతో నిండి ఉంటాయని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa