ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌కు ముఖం చాటేస్తోన్న నిశ్శబ్ద మిత్రులు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 07:48 PM

పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తన శక్తిని విస్తరించుకుని.. అమెరికా, ఇజ్రాయేల్ ప్రభావాన్ని, అలాగే ప్రత్యక్ష యుద్ధాలను నివారించేందుకు ఇరాన్ తన అనుబంధ సమూహాలతో ‘ప్రతిఘటన అక్షం’ అనే మిత్రబలగాన్ని నిర్మించుకుంది. అయితే, ఇరాన్‌పై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు వేళ ఈ అక్షం మౌనంగా ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్ , యెమెన్‌లో హౌతీలు , ఇరాక్‌లోని షియా మిలీషియా గ్రూప్‌లు ఇవన్నీ ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. ఇప్పటికే ఇవి బలహీనమై.. అంతర్గతంగా చీలిపోయి తమ అసలు శక్తిని కోల్పోయాయి. దీంతో తొలిసారి ఇరాన్ ఒంటరిగా యుద్ధం చేస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం లొంగిపోవాలని ఇరాన్‌ను హెచ్చరించినా అవి స్పందించకపోవడం గమనార్హం.


హెజ్బొల్లా


ఇరాన్‌కు అనుబంధంగా ఉనన అత్యంత శక్తివంతమైన లెబనాన్‌లోని షియా మిలీషియా హెజ్బొల్లా.. ఇరాన్‌పై ఇజ్రాయేల్ దాడులు తర్వాత కూడా పెద్దగా ప్రతీకార దాడులు చేయడం లేదు. ఏడాది కిందటి వరకూ ఇలా జరుగుతుందని ఊహించలేదు. కానీ 2023 నుంచి ఇజ్రాయేల్ జరిపిన భీకర దాడులతో హెజ్బొల్లా శక్తి, ఉత్సాహం, నాయకత్వం అన్నీ సన్నగిల్లాయి. సుదీర్ఘకాలం ఈ గ్రూప్‌కి అధినేతగా వ్యవహరించిన హసన్ నస్రల్లా‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇది ఒక మైలురాయిగా నిలిచింది.


వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. ప్రస్తుత నేత నయీమ్ కాసిం తనను తాను లెబనాన్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆయన కార్యాలయంలో ఎక్కడా ఇరాన్ గుర్తులు, ఖమేనీ ఫోటోలు లేకపోవడం గమనించదగ్గ విషయం. సిరియా ద్వారా అందే సహకారం బషర్ అల్ అసద్ పతనం తరువాత పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా హెజ్బొల్లా‌కు అవసరమైన నిధులు, ఆయుధ సరఫరాలు ఆగిపోయాయి.


హమాస్


గాజాలోని పాలస్తీనా మిలీషియా సమూహం హమాస్. ఇప్పుడు దాదాపు అంతమయ్యే స్థితికి చేరుకుంది. రెండేళ్లుగా ఇజ్రాయెల్‌తో జరుగుతోన్న యుద్ధంలో గాజా నాశనమైంది. హమాస్ సీనియర్ నేతలు ఇస్మాయిల్ హనియా, యహ్యా సిన్వార్ హతమయ్యారు. ఖతార్‌లో ఉన్న ఖలేద్ మషాల్ తప్ప గ్రూప్‌నకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది స్పష్టత లేదు. హమాస్ ఆధారపడిన సైనిక మౌలిక సౌకర్యాలైన సొరంగాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణి స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి.


2023 అక్టోబర్ 7న హమాస్ దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారినప్పటికీ, ఇరాన్ స్పందన పరిమితంగానే ఉంది. రాజకీయంగా మద్దతు ఇవ్వడం తప్ప, సైనిక స్థాయిలో పెద్దగా సహాయం చేయలేదు. ఇరాన్ సుప్రీం నేత ఆయుతుల్లా అలీ ఖమేనీ హతమార్చితేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటన తర్వాత కూడా హమాస్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


వ్యాపారవేత్తలుగా మిలీషియా గ్రూప్‌లు


ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న షియా మిలీషియా గ్రూప్‌లు గతంలో అమెరికా దళాలపై దాడులు చేసి, బాగ్దాద్‌లో ఇరాన్ ప్రభావాన్ని పెంచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయేల్ ఇరాన్‌పై దాడులు తరువాత, ఈ మిలీషియా గ్రూప్ స్వల్ప ప్రకటనలకే పరిమితమైంది తప్ప, మరే చర్య తీసుకోలేదు. కాటేబ్ హెజ్బొల్లా మాత్రమే భారీ వార్నింగ్ ఇచ్చింది. అదీ అమెరికా ఇజ్రాయేల్‌కు మద్దతు ప్రకటించిన తర్వాతే. ఇరాక్ ప్రధానమంత్రి మోహమ్మద్ అల్-సుదానీ ఓ మితవాది. ఆయన మిలీషియా నాయకులు ఈ సమస్య నుంచి తప్పించుకునేలా శాంతిని కోరినట్లు సమాచారం.


హౌతీలు ఎదురుచూస్తున్నారా?


యెమెన్‌లోని హౌతీలు ఇటీవలి నెలల్లో ఇజ్రాయేల్‌పై క్షిపణులను ప్రయోగించి తన శక్తిని బయటపెట్టారు. కానీ ఇప్పుడు వారూ స్వల్పస్థాయి దాడులకు పరిమితమయ్యారు. 2025 మార్చి, ఏప్రిల్‌లలో అమెరికా వైమానిక దళాలు వారి క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేయడంతో హౌతీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వారు ఇప్పటికీ ఇరాన్‌తో సమన్వయం చేసుకుంటున్నప్పటికీ, తమ విధానాన్ని స్వతంత్రంగా ప్రదర్శిస్తున్నారు.


ఇరాన్ మిస్సైల్ దాడులు.. ఆపలేకపోయిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, భారీ నష్టం!


క్రింక్


పశ్చిమాసియా వెలుపల ఇరాన్ మిత్రులు కేవలం శక్తివంతమైనవే కాకుండా.. చాలా సందర్భాల్లో ‘తొందరపాటు పాలన’కు ప్రాతినిధ్యం వహించయి. విదేశాంగ నిపుణుల ప్రకారం.. ఇరాన్, రష్యా, చైనా, ఉత్తర కొరియా కలసి ‘అల్లకల్లోల అక్షం’ లేదా ‘ క్రింక్ (CRINK) అక్షం’గా పిలుస్తారు. రష్యా ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నా.. ప్రస్తుత సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయేల్ దాడులను ఖండించి చేతులు దులుపుకుంది.


చైనా విషయానికి వస్తే ఇరాన్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. అమెరికా ఆంక్షలను బేఖాతరుచేస్తూ ఇరాన్ నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తోంది. ఇారన్‌ను 2023లో షాంఘై సహకార సంస్థలో చేర్చుకున్నా.. ప్రస్తుతం చైనా మధ్యవర్తిత్వ దిశగా కదులుతోంది. పశ్చిమ దేశాలను వ్యతిరేకిస్తోన్న ఉత్తర కొరియా.. ఇరాన్‌కు క్షిపణులు, అణు సాంకేతికత విషయాల్లో సహాయం చేసినట్టు అనుమానాలు ఉన్నాయి.


భారత్‌–ఇరాన్ మైత్రి?


భారత్ విషయానికి వస్తే.. ఇరాన్, ఇజ్రాయేల్ రెండింటితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయేల్‌తో పలు రంగాల్లో భాగస్వామ్యం కొనసాగుతున్నా, ఇరాన్‌తోనూ వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. గతేడాది ఇరాన్‌తో కలిసి చాబహార్ పోర్ట్ అభివృద్ధి కోసం పదేళ్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఇది రెండు దేశాల మద్య సంబంధాలను మరింత బలపరిచే అంశంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa