ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనవంతులకు షాకిచ్చిన ఒమన్ సర్కార్.. ఇక 5 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్

international |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:15 PM

గల్ఫ్ దేశాల్లో కీలకమైన ఒమన్ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2028 జనవరి 1వ తేదీ నుంచి ఒమన్ దేశ పౌరులపై ఆదాయపు పన్ను విధించాలని భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. ముడిచమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సృష్టించుకునే క్రమంలో భాగంగా ఒమన్ ప్రభుత్వం ఈ కీలక అడుగు వేయనుంది. ఇక ఈ ఇన్‌కమ్ ట్యా్క్స్ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఆదాయపు పన్ను విధించిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా ఒమన్ నిలవనుంది.


దీనిపై ఒమన్ ఆర్థిక శాఖ మంత్రి సయీద్ బిన్ మొహమ్మద్ అల్ సాక్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు ఆదాయంపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూనే.. ప్రజల సంక్షేమం కోసం చేసే వ్యయాలను కొనసాగించవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదాయ వనరులను విస్తరించుకోవడం చాలా ముఖ్యమని సయీద్ బిన్ మొహమ్మద్ స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 42 వేల రియాల్స్ అంటే సుమారు 109000 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.94 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ విధించాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఆదాయపు పన్ను 5 శాతం ఉంటుందని తెలిపింది. ఈ ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు 1 శాతం మంది మాత్రమే ఉంటారని అంచనా వేస్తున్నారు.


అయితే ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గర్ఫ్ దేశాలపైనా ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లోని ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలు ఇప్పటివరకు తమ దేశ ప్రజలపై ఆదాయపు పన్నును విధించడం లేదు. ఈ దేశాలు ప్రధానంగా చమురు ఎగుమతుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందడంతో పాటు.. విదేశీ కార్మికుల నుంచి కూడా భారీగా ఆదాయాన్ని పొందుతాయి. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పక్కనే ఉన్న ఇతర గల్ఫ్ దేశాలు దృష్టి సారించాయి.


ఒమన్ ఆర్థిక సంస్కరణలతో ముందుకు వెళ్లాలని చూస్తోందని.. అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ మోనికా మాలిక్ తెలిపారు. అదే సమయంలో పోటీతత్వాన్ని కూడా కొనసాగించాలని భావిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. ఒమన్‌కు వలస వస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అయితే ఈ ట్యాక్స్ పరిధి తక్కువే అయినప్పటికీ.. ఇది ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన ఆర్థిక పరిణామం అవుతుందని అంచనా వేశారు.


సౌదీ అరేబియా, బహ్రైన్ దేశాలు ఈ ఏడాది ఆర్థిక లోటును ఎదుర్కొనే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. మిగిలిన గల్ఫ్ దేశాలు పటిష్టమైన ఆర్థిక సమతుల్యతను కలిగి ఉంటాయని అంచనా వేసింది. భవిష్యత్తులో చమురుకు డిమాండ్ తగ్గితే.. తమ ఆదాయాలను కోల్పోకుండా ఉండేందుకు గల్ఫ్ దేశాలు చివరికి కొన్ని పన్నులను విధించాల్సిన అవసరం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయం తీసుకుంది. దాని వల్ల వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలని ఒమన్ ఆర్థిక మంత్రి అల్ సాక్రి వెల్లడించారు.


ఒమన్ తీసుకున్న నిర్ణయం.. ఇతర గల్ఫ్ దేశాలు కూడా భవిష్యత్తులో ఇన్‌కమ్ ట్యాక్స్‌ను అమలు చేయడానికి బాటలు వేస్తుందని మోనికా మాలిక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఆదాయంపై పన్ను ఉండదన్న కారణంతో ఇతర దేశాల్లోని సంపన్నులు అక్కడ నివాసం ఏర్పరచుకోవడం గమనార్హం. 2023 ఏడాదిలో 29.3 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురును ఒమన్ ఎగుమతి చేసింది. ఒమన్ చమురును ప్రధానంగా చైనా దిగుమతి చేసుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa