ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంట సమయంలో ఈ తప్పులతోనే అనారోగ్యాలు

Recipes |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 11:54 PM

వంట చేసేస్తున్నారు సరే. కానీ సరిగ్గా చేస్తున్నారు. సరిగ్గా అంటే..టేస్టీగా అని కాదు. ఆరోగ్యకరంగా ఉంటోందా అనేదే అసలు విషయం. వంట చేయడం అనేది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. రోజూ చేస్తే అదే అలవాటైపోతుంది. కానీ..హడావుడిగా, ఎలా పడితే అలా చేసుకుని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.


వంట చేసే సమయంలో చిన్న చిన్న తప్పుల వల్లే ఎన్నో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్. ముఖ్యంగా నాలుగు తప్పుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశముందని, అందుకే వాటిని కచ్చితంగా అవాయిడ్ చేయాలని అంటున్నారు. అంతే కాదు. అసలు వంట చేసే విధానంలోనే మార్పులు రావాలని సూచిస్తున్నారు. చిన్న అలవాట్ల లాగే అనిపించినా వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా..ఆయా పదార్థాలలో ఉండే పోషకాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే..కచ్చితంగా వంట చేసేటప్పుడు కొన్ని తప్పులు అసలు చేయకూడదని చెబుతున్నారు. మరి ఆ తప్పులు ఏంటి. వాటి వల్ల కలిగే నష్టమేంటో తెలుసుకుందాం.


ప్యాకెట్ పాలు కాగబెట్టడం


చాలా మంది ప్యాకెట్ పాలు వాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండడం వల్ల సౌకర్యంగా ఉంటోందని వీటిని వినియోగిస్తున్నారు. అయితే..ఈ ప్యాకెట్స్ లో వచ్చేవి పాశ్చురైజ్డ్ మిల్క్. అంటే..వాటిని నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద బాగా మరగబెట్టి ఆ తరవాత ప్యాక్ చేస్తారు. అందులో ఉండే హానికర బ్యాక్టీరియా అంతా తొలగిపోవాలని ఇలా గరిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద బాయిల్ చేస్తారు.


అయితే..పాలు కాగబెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఉండే అలవాటే. ఒకప్పుడంటే గేదె పాలు నేరుగా తెచ్చుకుని వాడే వారు. అందుకే కాగబెట్టే వాళ్లు. కానీ..ప్యాకెట్ పాలు మాత్రం అసలు కాగబెట్టాల్సిన పనిలేదని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్. అంతే కాదు. ఇలా మళ్లీ మరగబెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలు తొలగిపోతాయని అంటున్నారు. ముఖ్యంగా విటమిన్ బి 12 కోల్పోవాల్సి వస్తుంది. నరాల వ్యవస్థ మెరుగుపరిచేందుకు, ఎర్రరక్త కణాలు పెంచేందుకు ఈ విటమిన్ చాలా కీలకం. అందుకే..ప్యాకెట్ పాలను కాగబెట్టకూడదు.​


ఏ పాత్రల్లో వండుతున్నారు


పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు రోజూ వాడుతుంటారు. అంటే టమాటా, చింతపండు లాంటివి. ఇవి లేకుండా దాదాపు కూరలు ఉండనే ఉండవు. వీలైనంత వరకూ వీటిని తగ్గించడమే మంచిది. అయితే..ఇదే సమయంలో వాటిని వండే తీరులోనూ చేస్తున్న చిన్న తప్పుల వల్ల అసిడిటీ సమస్యలు పెరిగే అవకాశముంటుంది. టమాటా, చింతపండు, నిమ్మరసం, ఆమ్ చూర్ లాంటివి వాడినప్పుడు కచ్చితంగా ఇనుప పాత్రల్లోనే వండాలని చెబుతున్నారు లీమా మహాజన్. ఇలా చెప్పడానికి ఓ రీజన్ ఉంది. ఐరన్ పాత్రల్లో వంట చేసినప్పుడు ఆ పదార్థాలు ఇనుముతో రియాక్షన్ కి గురవుతాయి. అంటే..ఎంతో కొంత ఐరన్ వాటిలో చేరిపోతుంది. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంత వరకూ ఐరన్ మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా ఐరన్ డిఫిషియెన్సీ తగ్గుతుంది.


న్యూట్రిషనిస్ట్ ఏం చెప్పారంటే


ఆలు ఎలా వండాలంటే


ఆలు కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. కాస్తంత క్రిస్పీగా ఉంటే చాలు. ఎంత కూరైనా తినేస్తారు. అయితే.. ఆలుగడ్డలతో వంట చేసినప్పుడు కచ్చితంగా ముందే చల్ల నీళ్లలో వాటిని నానబెట్టాలని లీమా మహాజన్ సూచిస్తున్నారు. ఆలుగడ్డల్ని కట్ చేసిన తరవాత వాటిని కనీసం 10 నుంచి 20 నిముషాల పాటు చల్ల నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిపైన ఉన్న స్టార్చ్ అంతా తొలగిపోతుంది. ఇది తొలగిపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. చాలా సులువుగా ఆలుగడ్డలు అరుగుతాయి. అంతే కాదు. శరీరంలో గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది. వేపుళ్లు చేసినప్పుడు చాలా త్వరగా రోస్ట్ అవుతాయి. చాలా క్రిస్పీగా కూర చేసేందుకు వీలవుతుంది. ఆలుగడ్డ పూర్తిగా ఉడికేందుకు అవకాశముంటుంది.


వెల్లుల్లి ఎలా వాడాలంటే


వెల్లుల్లి లేకుండా కూరలు చేయడం చాలా అరుదు. అయితే..పచ్చి వెల్లుల్లి పాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. దీన్నే అల్లీన్ అంటారు. వెల్లుల్లిని కట్ చేసినప్పుడు, దాన్ని నలిచినప్పుడు ఇది కాస్తా అలిసిన్ గా మారుతుంది. అంటే..ఇదో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే పదార్థంగా మారిపోతుంది. అంతే కాదు. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా పెరుగుతాయి. వీటితో పాటు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ పెరుగుతాయి. అందుకే..కచ్చితంగా వెల్లుల్లిని నలిచి వాడుకోవాలి. వెల్లుల్లిని కట్ చేసిన తరవాత కనీసం 10 నిముషాల పాటు అలాగే ఉంచి ఆ తరవాత వంటకు వాడుకుంటే మంచిది.


ఈ జాగ్రత్తలతో ఆరోగ్యం


ఇప్పుడు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్ గా వంట చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు వీలవుతుంది. న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిదే. కానీ..దాన్ని సరిగ్గా ఎలా తీసుకోవాలన్న అవగాహన కూడా ఉండాలి. ఇప్పుడు లీమా మహాజన్ చెప్పింది కూడా అదే. అందుకే..వీలైనంత వరకూ వంట చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa