భారత రాజకీయ చరిత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కొత్త రికార్డును నెలకొల్పారు. ఆగస్టు 5వ తేదీ మంగళవారం నాటితో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. గతంలో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ 2,256 రోజులు హోంమంత్రిగా పని చేసిన రికార్డును అమిత్ షా బద్దలు కొట్టారు. ప్రస్తుతానికి ఆయన 2,258 రోజులకు పైగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అయితే అమిత్ షా ఈ రికార్డు సాధించడానికి, సుదీర్ఘకాలం హోమంత్రిగా కొనసాగడానికి ఆయన తీసుకున్న మూడే మూడు నిర్ణయాలు కారణం అని నిపుణులు భావిస్తున్నారు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
అమిత్ షా హోంమంత్రిగా చేసిన సమయంలో.. దేశ భవిష్యత్తులోనే మూడు చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో, భద్రతా విధానాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. అందులో ఒకటి ఆర్టిక్ 370 రద్దు కాగా మరో రెండు పౌరసత్వ సవరణ చట్టం, కొత్త క్రిమినల్ చట్టాలు. ఈ నిర్ణయాల వల్ల దేశంలోని పరిస్థితులు పూర్తిగా మారిపోయి.. బీజేపీ సర్కారు విజయానికి నాంది పలికింది.
ఆర్టికల్ 370 రద్దు .. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ఆయన తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటి. దీనివల్ల జమ్మూ కశ్మీర్ పూర్తిగా భారతదేశంలో విలీనమై.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సుదీర్ఘకాల వాగ్దానాల్లో ఒకటి. ఈ నిర్ణయం దేశ సమగ్రతకు, భద్రతకు ఎంతో దోహదపడింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA).. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం ను తీసుకురావడం మరో ముఖ్యమైన నిర్ణయం. ఈ చట్టం ప్రకారం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన వేధింపులకు గురైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించడానికి అవకాశం లభించింది.
కొత్త క్రిమినల్ చట్టాలు.. వందల సంవత్సరాల పాటు భారతదేశంలో అమలులో ఉన్న భారత శిక్షా స్మృతి (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకురావడం అమిత్ షా తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం. ఈ కొత్త చట్టాలు - భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌లు.. 2024వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ చట్టాలు మన కాలానికి, మన వ్యవస్థకు మరింత అనుగుణంగా ఉండేలా రూపొందించబడ్డాయి.
పైన పేర్కొన్న నిర్ణయాలతో పాటు అమిత్ షా తన పదవీకాలంలో నక్సలిజంను అంతం చేయడానికి ఒక గడువును కూడా నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాలలో శాంతిని నెలకొల్పడానికి వివిధ తిరుగుబాటు గ్రూపులతో 12 శాంతి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ చర్యలు దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేశాయి. అమిత్ షా నాయకత్వం ఒక వైపు బలమైన నిర్ణయాలతో.. మరో వైపు శాంతి స్థాపనతో కూడుకొని ఉండగా.. ఆయన పదవిలో ఇంతకాలం కొనసాగడానికి కారణం అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa