ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పాడేరులో సీఎం చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 03:41 PM

గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి కీలకమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిశపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఏజెన్సీ సమగ్రాభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాడేరులో జరిగిన సభలో ప్రసంగించిన ఆయన, గిరిజనుల చిరకాల ఆకాంక్ష అయిన ఉపాధ్యాయ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3ను పునరుద్ధరించే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు.ఏజెన్సీ ప్రాంతాలను దేవుడు సృష్టించిన అద్భుతంగా అభివర్ణించిన చంద్రబాబు, ఇక్కడి స్వచ్ఛమైన కొండలు, సహజసిద్ధమైన ప్రజల మనస్తత్వం తనను ఆకర్షించాయని తెలిపారు. "మళ్లీ జన్మ ఉంటే ఈ ఏజెన్సీలోనే పుట్టాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. గిరిజనుల సహజ నైపుణ్యం, సామర్థ్యాలను ప్రశంసిస్తూ, వారి అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సంపూర్ణ వికాసం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్‌ను గుర్తు చేస్తూ, ఆ దిశగా తమ ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని చంద్రబాబు తెలిపారు.ఏజెన్సీలోని 1,483 గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ. 2,850 కోట్లు మంజూరు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీరు అందిస్తామని, దీని కోసం రూ. 220 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రూ. 482 కోట్ల వ్యయంతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు పాడేరు, రంపచోడవరం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోనూ ఆసుపత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.జీవో నంబర్ 3 రద్దు కావడానికి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. తమ హయాంలో గిరిజన యువతకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ఆధారంగా జీవో తెచ్చామని, కానీ గత ప్రభుత్వం కోర్టులో సరిగ్గా వాదనలు వినిపించలేకపోయిందని విమర్శించారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా ఈ జీవోను పునరుద్ధరించి గిరిజనులకు న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ఏజెన్సీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. కాఫీ, మిరియాలు, పసుపు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభించేలా చూస్తామన్నారు. వెదురు ఉత్పత్తుల ద్వారా 5 వేల మంది గిరిజన మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. టూరిజం హబ్స్‌గా ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలైన పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటివి ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్ల వంటివని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని చంద్రబాబు స్పష్టంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa