భారత సైనిక శక్తి, వ్యూహానికి నిలువుటద్దంలా నిలిచిన ' ఆపరేషన్ సిందూర్ ' గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆపరేషన్ ప్రణాళిక అమలు గురించి వివరిస్తూ.. అది 'చదరంగం ఆడటం లాంటిది' అని వ్యాఖ్యానించారు. మే నెలలో జరిగిన సైనిక ఘర్షణల్లో తమదే విజయం అని పాకిస్థాన్ చేసిన వాదనలను ఆయన పరోక్షంగా ఎగతాళి చేశారు.
జనరల్ ద్వివేది వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రణాళిక గత ఏప్రిల్ 23న ప్రారంభమైంది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ విషాదకర సంఘటన తర్వాత.. ప్రధాని మోదీ ప్రభుత్వం సాయుధ దళాలకు 'స్వేచ్ఛా హస్తం' ఇచ్చిందన్నారు. ఈ నిర్ణయం తమ సైనిక కమాండర్ల ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచిందని జనరల్ ద్వివేది తెలిపారు. ఈ స్వేచ్ఛతో భారత సైన్యం, వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను పకడ్బందీగా ప్రణాళిక చేసి అమలు చేశాయని గుర్తు చేశారు.
భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఆపరేషన్ విజయాలపై ధృవీకరించారు. ఆపరేషన్ సమయంలో భారత వాయుసేన ఐదు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక పెద్ద విమానాన్ని కూల్చివేసినట్లు ఆయన వెల్లడించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు ఖచ్చితమైన దాడులు చేశాయి. ఈ దాడుల వల్ల పాకిస్థాన్‌కు మూడు రోజుల పాటు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం తాత్కాలిక కాల్పుల విరమణకు భారత్‌ను అభ్యర్థించింది. మానవతా దృక్పథంతో భారత్ ఈ అభ్యర్థనను అంగీకరించింది.
ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు బలమైన సందేశాన్ని పంపాయి. యుద్ధం, ఘర్షణలు అనేవి కేవలం శారీరక బలం లేదా ఆయుధాల సంఖ్యపై ఆధారపడి ఉండవని.. అవి వ్యూహం, మేధస్సుపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆపరేషన్ సిందూర్‌ను ఆయన చదరంగం ఆటతో పోల్చారు. ప్రతి కదలిక జాగ్రత్తగా, ప్రతిస్పందనను అంచనా వేసి ఉండాలని, అప్పుడే విజయం సాధించవచ్చని ఆయన చెప్పారు. ఈ ఘర్షణలో పాకిస్థాన్‌కు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ దేశం చేసిన 'విజయం' వాదనలు ఎంత హాస్యాస్పదమో ఆయన మాటల ద్వారా స్పష్టమైంది. మొత్తంగా ఈ ఆపరేషన్ భారత్ సైనిక శక్తిని, నిబద్ధతను, వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశ భద్రతకు సంబంధించి భారత నాయకత్వం ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోగలదో ఈ ఘటన రుజువు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa