ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ

national |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 09:40 PM

దేశ రాజధాని ప్రాంతంలో కుక్క కాట్లు, రేబిస్‌ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వీధి కుక్కలపై సంచలన తీర్పును వెలువరించింది. ఢిల్లీ నగరంతోపాటు ఎన్‌సీఆర్ ప్రాంతం (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ తొలగించాలని ఇచ్చిన తీర్పుపై జంతు ప్రేమికులు, ఇతర వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధాని పరిధిలో వీధి కుక్కలు కనిపించకూడదని.. ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో స్వయంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ఈ తీర్పును తాను పరిశీలించనున్నట్లు ప్రకటించారు.


ఢిల్లీ, ఎన్సీఆర్‌ల ప్రాంతంలో వీధి కుక్కల కారణంగా రేబిస్‌ మరణాల సంఖ్య పెరుగుతుండటంపై వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. ఇటీవల కీలక తీర్పును ఇచ్చింది. 8 వారాల లోపు ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను అన్నింటినీ షెల్టర్లలోకి తరలించాలని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. వీధి కుక్కలను తరలించడంలో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తే వారు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు ఇచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలను మాత్రమే వింటామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. తాము ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు గానీ.. ఇతర పార్టీలు గానీ, సంస్థలు గానీ దాఖలు చేసిన పిటిషన్లను విచారించేది లేదని తేల్చి చెప్పింది.


అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుపై జంతు హక్కుల కార్యకర్త, కేంద్ర మాజీమంత్రి మేనకా గాంధీ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ తీర్పును ఆచరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని.. వాటికోసం 3 వేల షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకు రూ.15 వేల కోట్లు ఖర్చు అవుతుందని.. ఇంత ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. వీధి కుక్కల తొలగింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా ఖండించారు. గత కొన్ని దశాబ్దాలుగా మనం అనుసరిస్తున్న విధానాలను వెనకడుగు వేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు. వీధి కుక్కలను తొలగించాలన్న నిర్ణయం చాలా క్రూరమైందని పేర్కొన్నారు.


జంతు సంక్షేమ కార్యకర్తలు మాత్రం సుప్రీం తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడానికి తగిన నిధులు లేవని.. ఈ తీర్పు అమలు చేయడం అసాధ్యమని వాదించారు. జంతు ప్రేమికులే కాకుండా రాజకీయ నేతలు, పలువురు సెలబ్రిటీలు కూడా ఈ తీర్పు పట్ల తమ వ్యతిరేకతను వ్యక్యం చేశారు. ఈ తీర్పుపై సమీక్షించాలని ఇప్పటికే నటుడు జాన్ అబ్రహం సీజేఐకి ఎమర్జెన్సీ రిక్వెస్ట్ చేశారు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించింది. వీధి కుక్కలను ఇలా భారీగా తరలించడం శాస్త్రీయం కాదని అభిప్రాయపడింది. ఈ తీర్పు కుక్కల జనాభాను నియంత్రించడంలో లేదా రేబిస్‌ వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడదని తెలిపింది.


ఈ తీర్పును పలువురు లాయర్లు కూడా చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువస్తూ.. గతంలో ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. జీవుల పట్ల కరుణ చూపించడం కూడా ఒక రాజ్యాంగ విలువనే అంటూ జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో స్పందించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని తేల్చి చెప్పడంతో ఈ తీర్పు వేళ ఆందోళనలో ఉన్న జంతు ప్రేమికులకు కాస్త ఊరట కలిగినట్లయింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ స్వాగతించాయి. ఈ నిర్ణయం వల్ల వీధి కుక్కల బెడద తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్న పిల్లలు, వృద్ధులు సురక్షితంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa