ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ భయంతోనే సుంకాలు.. అమెరికాపై ఆర్ఎస్ఎస్ చీఫ్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 08:29 PM

మనమంతా ఆ భగవంతుడి పిల్లలమని అందరూ గ్రహిస్తే ఎలాంటి అభద్రతాభావం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ అన్నారు. భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందడం చూసి ఓర్చుకోలేని కొందరు ఆందోళనతోనే అదనపు సుంకాలు విధించారని విమర్శించారు. శుక్రవారం నాగ్‌పూర్‌లో బ్రహ్మకుమారీల కార్యక్రమానికి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా జరగాలని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. అయితే, 50 శాతం అదనపు టారీఫ్‌లపై అమెరికా పేరు ప్రస్తావించకుండానే భగవత్ చురకలు అంటించారు.


‘‘మన మధ్య శత్రుత్వం లేకపోతే ఎవరూ శత్రువులు కాదు..గతంలో పాములను చూస్తే భయపడేవాళ్లం.. కానీ, జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని పాములూ విషపూరితం కాదని తెలుసుకున్నాం.. అప్పుడు ఆ పాములను అలాగే వదలిపెట్టడం మొదలుపెట్టాం.. జ్ఞానం వల్ల భయం, వివక్ష అన్నీ తొలగిపోయాయి’’ అని అన్నారు. ‘‘భారత్ అభివృద్ధి చెందితే ఏం అవుతుంది? అందుకే సుంకాలు విధిస్తారా? సప్త సముద్రాల ఆవల ఉన్న మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? కానీ, ‘నేను.. నాది’ అనే భావనతో భయపడుతున్నారు.. కానీ, ఈ రోజు ప్రపంచానికి పరిష్కారం అవసరం.. మీరు అసంపూర్ణ దృక్కోణంతో పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు అందుకే విఫలమయ్యారు’’ అని పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు.


‘‘అంతర్జాతీయ వాణిజ్యం ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛంగా స్వచ్ఛంద సహకారంపై ఆధారపడి ఉండాలి.. అందుకే మనం స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.. ఆత్మనిర్బర్ అంటే దిగుమతులు నిలిపివేయడం కాదు.. ప్రపంచం పరస్పర ఆధారంతో నడుస్తోంది.. కాబట్టి ఎగుమతులు.. దిగుమతులు కొనసాగుతాయి.. కానీ, వాటిలో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు’’ అని పేర్కొన్నారు. భారత్‌పై తొలుత 25 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందనే సాకుతో అదనంగా మరో 25 శాతం సుంకాలు కలిసి 50 శాతం విధించారు. ఈ చర్యలతో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.


అయితే, గత నాలుగైదు రోజులుగా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చినట్టు సంకేతాలు కూడా వచ్చాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, అవి విజయవంతంగా ముగుస్తాయని తాను ఆశిస్తున్నానని ట్రంప్ తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో చర్చలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బదులిచ్చారు. ఈ క్రమంలో భారత్, అమెరికాల మధ్య ఆరో దశ వాణిజ్య చర్చలు త్వరలోనే జరగునున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa