ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్స‌వాల పేరుతో భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 12:40 PM

గొడుగుపేట వేంక‌టేశ్వ‌ర‌ స్వామి ఆల‌య భూముల క‌బ్జాకి సంబంధించి త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఎంపీ కేశినేని చిన్ని చెబుతున్నాడు. కానీ ఇదే 40 ఎక‌రాల భూమిని కోర్టు తీర్పుకి విరుద్దంగా చ‌దును చేసి సొసైటీ ఫ‌ర్ వైబ్రంట్ విజ‌యవాడ అనే సొసైటీ విజ‌య‌వాడ ఉత్స‌వ్‌ను నిర్వ‌హిస్తోంది. దీనికి ఎంపీ కేశినేని చిన్ని ప్రెసిడెంట్‌గా ఉంటే, ప‌ట్టాభి సెక్ర‌ట‌రీగా ఉన్నాడు. క‌బ్జా చేయాల‌ని ఆలోచ‌న లేక‌పోతే ముందుగానే మ‌ట్టి త‌ర‌లించి చ‌దును చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందో చెప్పాలి అని ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్ ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... విజ‌య‌వాడ ఉత్స‌వ్ కోసం ముర‌ళీ ఫార్చ్యూన్‌లో ఇప్పటి వ‌ర‌కు ప‌ది మీటింగ్‌లు పెట్టి సినీ తార‌ల్ని పిలిపించి భారీగా కార్య‌క్ర‌మంతో ప్రారంభోత్స‌వం చేసిన టీడీపీ నాయ‌కులు, అమ్మ‌వారి ఉత్స‌వాల నిర్వ‌హణ గురించి ప‌ట్టించుకోలేదు. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ ఆరోప‌ణ‌లు చేస్తే ఇన్నాళ్ల త‌ర్వాత నిన్ననే ఒకే ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇదీ, అమ్మ‌వారి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ మీద వారికున్న చిత్త‌శుద్ధి. విజ‌య‌వాడ‌కి ఎంతోమంది గొప్ప వ్య‌క్తులు ఎంపీగా ప‌నిచేస్తే కేశినేని చిన్ని మాత్రం దానికి క‌ళంకం తెచ్చేలా అవినీతికి అడ్డాగా మార్చేశాడు. చిన్నికి ప్ర‌జ‌ల మీద క‌న్నా డ‌బ్బుల మీద‌నే ప్రేమ‌. ఏ ప‌నిచేయాల‌న్నా డ‌బ్బు ఇవ్వాల్సిందే. పిన్న‌మ‌నేని ఫార్మ‌సీ కాలేజీలో ఏటా ద‌స‌రాకి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రులు జ‌రుగుతుంటే ఈ ఏడాది పెట్టొద్ద‌ని ఎంపీ ఫోన్ చేసి బెదిరించాడు. వారికి స్పాన్స‌ర్ చేసే వాళ్లంతా విజ‌య‌వాడ ఉత్స‌వ్‌కి విరాళాలివ్వాల‌ని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఫార్మ‌సీ అసోసియేష‌న్ ని పిలిపించి ఉత్స‌వాల‌కు రూ.2 కోట్లు ఇవ్వాల‌ని ఎంపీతో క‌లిసి ప‌ట్టాభి బెదిరించాడు. ప్ర‌తి అసోసియేష‌న్ కి ఫోన్లు చేసి బెదిరించి ఉత్స‌వాల‌కు డ‌బ్బులివ్వాల‌ని వేధింపుల‌కు గురిచేస్తున్నాడు. ఉత్స‌వాల పేరుతో దోచుకోవాల‌ని ఎంపీ కేశినేని చిన్ని భారీ స్కెచ్ వేశాడు. ఎంపీ కేశినేని చిన్ని చేసే ప‌నుల కార‌ణంగా విజ‌య‌వాడ ప‌రువు పోయింది. వ్యాపార‌వేత్త‌లంతా ఎంపీ పేరెత్తితే భ‌య‌ప‌డిపోతున్నారు. కుటుంబంతో క‌లిసి నేను దుబాయ్ వెళ్తుంటే, పోలీసులు ప‌ర్మిష‌న్ లేద‌ని చెప్ప‌డంతో తిరిగొచ్చేశాను. దానికే నేను కేసుల‌కు భ‌య‌ప‌డి పారిపోతున్నాన‌ని ఎంపీ ప్ర‌చారం చేసుకోవ‌డం ఆయ‌న దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం. రెడ్ బుక్ రాజ్యాంగంతో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టే అక్ర‌మ కేసుల‌కు అవినాశ్ భ‌య‌ప‌డి పారిపోయేర‌కం కాద‌ని గుర్తుంచుకోవాలి. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక ఎంపీ కేశినేని చేసిన అక్ర‌మాల‌న్నీ వెలికితీసి ఎక్క‌డున్నా తీసుక‌చ్చి కోర్టుల్లో శిక్ష‌లు ప‌డేదాకా పోరాడ‌తాం అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa