ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభేదాల తర్వాత మొదటిసారి,,,ట్రంప్, ఎలాన్ మస్క్ అనూహ్య భేటీ

international |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 08:00 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. బహిరంగంగానే వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా.. ఈమధ్య ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. కానీ వారి స్నేహం మాత్రం కొనసాగలేదు. అయితే తాజాగా వీరిద్దరూ అనూహ్యంగా భేటీ అయ్యారు. తీవ్రమైన విభేదాల తర్వాత మొదటి సారి ఓ చోటు ఇరువురు నేతలు కలుసుకున్నారు. ఇటీవలే హత్యకు గురైన రైట్‌వింగ్ నేత చార్లీ కిర్క్ సంస్మరణ సభలో భాగంగా ఆదివారం అరిజోనాలోని గ్లెన్‌డేల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వారు ఇద్దరు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీ క్యాంపస్‌లో చార్లీ కిర్క్‌ను ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయనకు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే వేలాది మంది ఈ సభలో పాల్గొని కిర్క్‌కు నివాళులు అర్పించారు. కిర్క్ తన సన్నిహితుడు కావడంతో.. ట్రంప్ ఈ సభకు హాజరయ్యారు. అలాగే ఎలాన్ మస్క్ సైతం ఈ కార్యక్రమానికి రాగా.. ట్రంప్, మస్క్ ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. అక్కడే వీరిద్దరూ మాట్లాడుకుంటూ.. అందరికీ షాక్ ఇచ్చారు.


ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎంతో సన్నిహితుడిగా, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న ఎలాన్ మస్క్.. కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రభుత్వం నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చారు. ముఖ్యంగా 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' అనే సంస్థకు ఆయన నాయకత్వం వహించారు. అయితే ట్రంప్ ప్రభుత్వపు పన్నుల, వ్యయాల బిల్లును "పిచ్చి, విధ్వంసకరమైనది" అని మస్క్ బహిరంగంగా విమర్శించారు. దీంతో ట్రంప్ ఆయనతో ఉన్న అన్ని ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ఆ తర్వాత మస్క్ సొంతంగా 'అమెరికా ఫస్ట్' పార్టీని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇలాంటి కఠిన పరిస్థితుల తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకే చోట కలవడం ఆసక్తిని రేపుతోంది.


 ఈ కార్యక్రమం తర్వాత వైట్‌హౌస్ అధికారికంగా వారిద్దరూ మాట్లాడుకుంటున్న చిత్రాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మస్క్ కూడా అదే చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో "చార్లీ కోసం" అని రాస్తూ పోస్ట్ చేశాడు. ఈ చర్య వారి మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తున్నాయని సూచిస్తోంది. 2025లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మస్క్ 270 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ అమెరికా రాజకీయాలలో ఒక ముఖ్యమైన పరిణామంగా కనిపిస్తోంది.


మస్క్ అధ్యక్షతన ప్రారంభమైన DOGE అనేది ఒక వివాదాస్పద కార్యక్రమం. దీనిలో భాగంగానే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేశారు. ఈ ఉద్యోగాలను వృథా, మోసం, దుర్వినియోగం వంటి పేర్లతో వివరిస్తూ వాటన్నింటినీ పూర్తిగా తీసేసింది. కానీ DOGE నుంచి బయటకు వచ్చిన తర్వాత మస్క్ ట్రంప్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పట్టారు. దానికి ట్రంప్ సమాధానంగా మస్క్ కంపెనీలతో ఉన్న ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. కానీ మళ్లీ వారిద్దరూ కలిసి మాట్లాడుకోవడం, అందుకు సంబంధించిన ఫొటలు, వీడియోలను సోషల్ మీడియా వేధికగా షేర్ చేయడం చూస్తుంటే.. వీరిద్దరి భవిష్యత్ సంబంధాలపై అందరిలోనూ అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa