ప్రస్తుత రోజుల్లో బ్యాంకులో అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికూ ఉంటోంది. అందులో సేవింగ్స్ అకౌంట్లే నూటికి 90 శాతం మేర ఉంటాయి. అయితే, పొదుపు ఖాతాలోని డబ్బులకు బ్యాంకులు చాలా తక్కువ వడ్డీ ఇస్తాయి. 2 శాతం, 3 శాతం ఆలోపే వడ్డీ రేట్లు ఉంటాయి. అది కూడా పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉన్న వారికే వడ్డీ చెల్లిస్తాయి. తక్కువ నగదు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ పెద్దగా కనిపించదు. తక్కువ మొత్తంలోని డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ సేవింగ్స్ అకౌంట్లు అపఖ్యాతి పాలయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి చాలా ప్రభుత్వ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ల ద్వారా రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్ ఉంటే 2.5-3 శాతం వరకే వడ్డీ ఇస్తాయి. కానీ, దేశంలోని మొట్ట మొదటి సారి బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా అత్యధిక వడ్డీ ఇస్తోంది ఓ బ్యాంక్. ఆ వివరాలు తెలుసుకుందాం.
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. సేవింగ్స్ ఖాతాలపై 5.50 శాతం వడ్డీ ఇస్తున్నట్లు తెలిపింది. రూ.100, రూ.500, రూ.1000, రూ.10 వేలు, రూ.1 లక్ష ఎంత బ్యాలెన్స్ ఉన్నా ఈ వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది. బ్యాంక్ బజార్ డాట్‌కామ్ ప్రకారం.. రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్ పై 5.50 శాతం వడ్డీ ఇవ్వడం అనేది దేశంలోని దిగ్గజ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకులు సైతం ఇంత మొత్తం వడ్డీ ఇవ్వడం లేదని పేర్కొంది.
మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెపో రేటును 1 శాతం మేర కోత పెట్టింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం మించి వడ్డీ రేట్లు ఇవ్వడం లేదని నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు ప్రస్తుతం రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్‌పై 2.50 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. వీటితో పాటు చాలా బ్యాంకులు గరిష్ఠంగా 3 శాతం వరకే వడ్డీ ఇస్తున్నాయి.
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు ను100 శాతం ఇస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 5.50 శాతం వద్ద ఉంది. ఇటీవలే జరిగిన మనీటరీ పాలసీ కమిటీ సమావేశంలో సెప్టెంబర్- అక్టోబర్ రెపో రేటును మార్చకుండా యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. సేవింగ్స్ అకౌంట్లలో అన్ని రకాల బ్యాలెన్సులపై 5.5 శాతం వడ్డీ ఇస్తున్నట్లు స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజన్ బజాజ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa