అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై ప్రకటించిన 100 శాతం సుంకాలపై చైనా గట్టిగానే స్పందించింది. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, పోరాటానికి వెనుకాడబోమని తేల్చిచెప్పింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని మండిపడింది. అమెరికా అధ్యక్షుడి చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆరోపింది. సాధారణంగా తాము ఎవరితోనూ గొడవలు, ఘర్షణలు పెట్టుకోమని, అవసరం వస్తే మాత్రం పోరాటానికి వెనుకడగువేయబోమని స్పష్టం చేసింది. అయితే, దీనికి ప్రతిచర్యలు కూడా ఉంటాయని పేర్కొంది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు అమెరికా, చైనా ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికా రక్షణ; సాంకేతిక పరిశ్రమలకు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఇతర ముఖ్య ఎగుమతులకు సంబంధించి చైనా ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్.. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కూడా రద్దు చేసుకుంటానని ఆయన బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే చైనాపై అదనంగా మరో 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ట్రంప్... నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. అంతేకాదు, చైనా తీసుకునే తదుపరి చర్యలు ఆధారంగా అమెరికా నిర్ణయం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.
ఇదిలాఉండగా, అమెరికా- చైనాల మధ్య వాణిజ్య వివాదం చాన్నాళ్లుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం పరిష్కరించుకునే దిశగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలోనే ట్రంప్ మరోసారి చైనాపై సుంకాల బాంబు పేల్చడం గమనార్హం.
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య అకస్మాత్తుగా మొదలైన మాటల యుద్ధం.. దక్షిణ కొరియాలో ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే కీలక సమావేశానికి కొన్ని వారాల ముందే చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య విస్తృత వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రయత్నం చేయనున్నట్లు భావిస్తున్నాయి. ఈ చర్చలకు ప్రధాన ఆయుధం ఎగుమతి నియంత్రణలు. ముఖ్యంగా, చైనా ఆధారపడిన సెమీ-కండక్టర్‌లు, కృత్రిమ మేధ (AI) చిప్‌ల ఎగుమతిపై అమెరికా, అత్యంత అరుదైన ఖనిజాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా నియంత్రణలు ఈ చర్చలలో ప్రధానం. గతంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు 125 శాతం మేర సుంకాలు విధించారు. తర్వాత వాటి అమలను నిలిపివేసి, వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించారు. కానీ, మళ్లీ ట్రంప్ పాతపాటే పాడటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa