శీతాకాలం వస్తుందంటే ఢిల్లీవాసులు భయపడిపోయే పరిస్థితి. వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుని, గాలి విషంగా మారిపోతుంది. కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తీవ్రత మాత్రం తగ్గదు. త్వరలోనే శీతాకాలం మొదలు కానుండగా.. ఢిల్లీలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కాలుష్య నియంత్రణ కమిటీ ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్.. జీఆర్ఏపీ 1 ఆంక్షలను మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211గా నమోదుకావడంతో ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించారు.
జీఆర్ఏపీ సబ్-కమిటీ సమీక్ష సమావేశంలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి వచ్చిన రియల్-టైమ్ డేటా, భారత వాతావరణ విభాగం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అంచనాలను విశ్లేషించారు. ‘వాయు నాణ్యత సూచీ (AQI) ప్రస్తుతం ‘అత్యంత దారుణమై’ స్థాయికి చేరింది. వాతావరణం స్థిరంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ స్థాయి కొనసాగుతుందని అంచనాలు సూచిస్తున్నాయి’ అని కమిటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
జీఆర్ఏపీ స్టేజ్-1లో (వాయు నాణ్యత సూచీ 201-300 మధ్య) ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోని ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ జిల్లాల్లో అధికార యంత్రాంగం, కాలుష్య నియంత్రణ బోర్డులు, మున్సిపాల్టీలు అమలకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము నియంత్రణ: నిర్మాణ కార్యకలాపాలపై కఠినమైన నిషేధం; దుమ్ము, ధూళి ఎగరకుండా తప్పనిసరిగా నీళ్లను చల్లడం.
పారిశ్రామిక, వాహన వ్యర్థాల నియంత్రణ:
కాలుష్య కారక పరిశ్రమల తనిఖీలను పెంచడం, ప్రజా రవాణా కోసం సీఎన్జీ వాహనాలను మెరుగుపరచడం. వ్యర్థాల నిర్వహణ: చెత్తను తగులబెట్టే కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయడం, బయో-మెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు కఠినంగా అమలు చేయడం. రహదారులు, విద్యుత్ రంగం: కార్బన ఉద్గారాలను వెలువరించే భారీ వాహనాల తనిఖీలు, ఢిల్లీకి 10 కిలోమీటర్ల లోపల ఉన్న విద్యుత్ ప్లాంట్లు 100 శాతం పైప్‌లైన్ ద్వారా సహజ వాయువుకు మారడం.
గాలి నాణ్యత సూచీ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరకుండా నిరోధించేలా చర్యలను తీవ్రతరం చేయాలని, కఠినమైన నిఘా నిర్వహించాలని అన్ని ఏజెన్సీలను ఆదేశించింది. ప్రజా రవాణాను ఉపయోగించడం, కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో పనులు నిలిపివేయడం, హెల్ప్‌లైన్ (1800-180-1708) ద్వారా ఉల్లంఘనలను నివేదించడం సహా GRAP తొలిదశను ప్రజలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయాన్ని పర్యావరణ నిపుణులు స్వాగతించారు కానీ, నియంత్రణకు నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని హెచ్చరించారు. ‘జీఆర్ఏపీ ఒక కట్టుదిట్టమైన చర్య; పంట వ్యర్థాల దహనం సహా అంతర్రాష్ట్ర సమన్వయాన్ని నేరుగా ఎదుర్కోకుండా అనివార్యమైన కాలుష్యాన్ని వాయిదా వేస్తున్నాం’ అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అనుమిత రాయ్‌చౌదరి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa