ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 02:52 PM

రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న నమ్మకంతోనే గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులకు రక్షణ ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారని, తద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో మంగళవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి భద్రత ఉంటుందన్న భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి అన్నారు. "శాంతిభద్రతలు అనే పునాదిపైనే అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటాయి. సమాజంలో అశాంతి, అలజడి ఉంటే ఏ ఒక్క పరిశ్రమా రాష్ట్రం వైపు చూడదు. అందుకే శాంతిభద్రతల విషయంలో నేను ఎప్పుడూ కఠినంగా ఉంటాను. ఆ నమ్మకంతోనే విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. ఇలాంటివి మరిన్ని రావాలంటే పోలీస్ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి" అని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో ఏపీ పోలీసులది ప్రత్యేక గుర్తింపు అని ప్రశంసించారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. "1959 అక్టోబర్ 21న లఢఖ్‌లో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి 10 మంది జవాన్లు ప్రాణత్యాగం చేశారు. వారి స్ఫూర్తితోనే ఏటా ఈ రోజును పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 192 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న పోలీసులు చేసేది కేవలం ఉద్యోగం కాదు, అదొక నిస్వార్థ సేవ. వారి త్యాగాలను స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలి" అని అన్నారు.సమాజంలో నేరాల స్వరూపం మారుతోందని, ముఖ్యంగా రాజకీయ ముసుగులో కొత్త తరహా నేరగాళ్లు పుట్టుకొస్తున్నారని చంద్రబాబు హెచ్చరించారు. "సమాజంలో అశాంతి సృష్టించి లబ్ధి పొందడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారు. వీళ్లు సాధారణ నేరగాళ్ల కంటే ప్రమాదకరం. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం, జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహ దహనం వంటి ఘటనల్లో వాస్తవాలను దాచిపెట్టి, మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించారు. సీసీ కెమెరాల వల్ల నిజాలు బయటపడ్డాయి. కల్తీ మద్యం విషయంలోనూ ఇలాగే దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు," అని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా సాగే వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాలు పోలీసులకు పెను సవాలుగా మారాయని పేర్కొన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. "నేరగాళ్లు అప్‌డేట్ అవుతుంటే, వారిని పట్టుకోవడానికి పోలీసులు మరింత అప్‌డేట్‌గా ఉండాలి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీసులకు మూడో కన్నులా పనిచేస్తుంది. డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్ వంటి టెక్నాలజీని వినియోగించి నేరాలను ఛేదిస్తున్నారు. అడవుల్లో గంజాయి తోటలను, ఎర్రచందనం స్మగ్లర్లను గుర్తించడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో ఏపీ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది" అని అభినందించారు.పోలీసుల సంక్షేమానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. "పోలీసుల గౌరవం పెంచడంతో పాటు వారి కుటుంబ సంక్షేమ బాధ్యత మాది. పోలీసుల వైద్య సేవల కోసం 16 నెలల్లో రూ.33 కోట్లు విడుదల చేశాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద రూ.23 కోట్లు అందించాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేయాలని నిర్ణయించాం. పోలీసులకు ఒక సరెండర్ లీవ్‌ను రెండు విడతల్లో చెల్లిస్తాం. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేశాం. శాఖాపరమైన పదోన్నతులు కూడా సకాలంలో అందిస్తాం" అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa