ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీ అరేబియాలో ‘కఫాలా’ వ్యవస్థ రద్దు.. 25 లక్షల మంది భారతీయులకు భారీ ఊరట

international |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:35 PM

దశాబ్దాలుగా విదేశీ కార్మికుల హక్కులను హరించిన వివాదాస్పద 'కఫాలా' వ్యవస్థను రద్దుచేస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ఇటీవల ధ్రువీకరించింది. దీంతో దాదాపు 1.3 కోట్ల మంది వలసదారులకు (భారత్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల కార్మికులు) భారీ ఊరట లభించింది. కఫాలా స్పాన్సర్‌షిప్ వ్యవస్థను 1950లో తీసుకొచ్చారు. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల ప్రవాహాన్ని నిర్వహణ కోసం దీనిని రూపొందించారు. గల్ఫ్ దేశానికి ఉపాధికోసం వెళ్లేవారు స్థానిక స్పాన్సర్ (కఫీల్)తో ముడిపడి ఉంటారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదాపై దాదాపు పూర్తి నియంత్రణ కఫీల్‌కే ఉంటుంది.


  పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించడం, ఉద్యోగాలు మారాలన్నా, దేశం విడిచి వెళ్లాలన్నా వారి అనుమతి వంటి నిబంధనల కారణంగా ఇదో ఆధునిక బానిసత్వ వ్యవస్థగా మానవహక్కుల సంఘాలు తరుచూ విమర్శలు గుప్పిస్తున్నాయి. స్పాన్సర్‌షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమరవాణాకు ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ సహా పలు ప్రపంచ సంస్థలు ఆరోపణలు చేశాయి.


కర్ణాటక నర్సు ఉదంతం


ఉదాహరణకు కర్ణాటకకు చెందిన 46 ఏళ్ల నర్సు జసింతా మెండోన్సా కేసును తీసుకుంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమెను 2016లో ఏజెంట్లు ఖతార్‌కు పంపారు. అక్కడ నుంచి సౌదీ అరేబియాకు అక్రమంగా తరలించగా.. ఆమెను విడుదల చేయాలంటే రూ.4.3 లక్షలు కట్టాలని ‘కఫీల్’డిమాండ్ చేశాడు. చివరికి దౌత్య, న్యాయ మార్గాల ద్వారా ఆమె విడుదలయ్యారు. మెండోన్సా ఉదంతం గల్ఫ్ దేశాలకు వెళ్లి త్వరగా డబ్బు సంపాదించి తిరిగి రావాలని కలలుగన్న భారత యువతలో చాలామంది ఎదుర్కొన్న దురదృష్ట ఘటనల్లో ఒకటి.


తాజాగా, సౌదీ అరేబియా కఫాలా వ్వవస్థను రద్దుచేయడంతో ఇలాంటి భయానక ఘటనలకు ముగింపు పడనుంది. ఇప్పటికే ఇజ్రాయెల్, బహ్రెయిన్ ఈ వ్యవస్థను రద్దుచేశాయి. కానీ, కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతోంది. ఈ దేశాల్లోని దాదాపు 2.5 కోట్ల మంది మంది విదేశీ కార్మికులు కఫాలా వ్యవస్థ కింద పనిచేస్తుండగా.. వీరిలో 75 లక్షల మంది భారతీయులే.


సౌదీ యువరాజు 2030 విజన్


సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 2030 విజన్ లక్ష్యాల్లో భాగంగా కఫాలా వ్యవస్థను జూన్‌లో రద్దుచేశారు. 2029 ఆసియా వింటర్ గేమ్స్ సహా పలు అంతర్జాతీయ ఈ వెంట్ల నిర్వహణకు ముందు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఆ దేశంలోని 25 లక్షల మంది భారతీయులు సహా 1.3 కోట్ల మంది విదేశీ కార్మికులకు లబ్ది పొందనున్నారు.


ముఖ్యంగా మహిళలు ఈ కఫాలా వ్యవస్థకు అత్యంత ప్రభావితులయ్యారు. ‘కఫీల్‌’ల చేతుల్లో లైంగిక దాడులకు గురైన అనేక ఘటనలను హక్కుల సంస్థలు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఉదాహరణకు 2017లో గుజరాత్‌కు చెందిన ఒక మహిళను ఆమె ‘స్పాన్సర్‌’ సౌదీ అరేబియాలో సెక్స్ బానిసగా చేసుకున్నాడు. ఆ తరువాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమెను స్వదేశానికి తీసుకువచ్చింది.


అదే ఏడాది కర్ణాటకకు చెందిన ఒక మహిళకు నెలకు రూ.1.5 లక్షల జీతంతో ఉద్యోగం ఉంటూ సౌదీకి తీసుకెళ్లి, అక్కడ లైంగిక దోపిడీకి గురిచేశారు. దమ్మామ్ నగరంలోని ఓ భవనం నుంచి ఆమె కిందికి విసిరేశారు. ఆమెను రక్షించడానికి ప్రభుత్వం మళ్లీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ హక్కుల సంఘాల నివేదికల ప్రకారం భారత్, నేపాల్‌, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఇథియోపియా వంటి దేశాలకు చెందిన వేలాది మంది ఇలాంటి బాధితులే ఉన్నారు.


సౌదీ ఎందుకు రద్దుచేసింది?


సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి. స్వచ్ఛంద, సహాయ సంస్థల నివేదికలు, కీలకమైన విదేశీ పెట్టుబడుదారుల అసంతృప్తి ప్రభావితం చేశాయి. కానీ, చివరికి ఇది యువరాజు తీసుకున్న నిర్ణయం. దీని వెనుక సౌదీ అరేబియా ప్రపంచ స్థాయి ఆశయాలే ప్రధాన కారణం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa