ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. రూ.700 పలుకుతోన్న కిలో టమోటా

international |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:47 PM

మన దాయాది పాకిస్తాన్ దేశాన్ని ప్రకృతి వైపరీత్యాలు, సరిహద్దు ఘర్షణలతో పాటుగా.. నిత్యవసరాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా నిత్యావసరాల ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. ఏం తిందామన్న భయపడాల్సిన పరిస్థితి. తాజాగా కూరల్లో తప్పనిసరిగా వాడే టమాటా ధర పాకిస్తాన్‌లో కొండెక్కి కూర్చుంది. కిలో టమాటా ధర రూ.700 పలుకుతుండటంతో.. జనాలు టమాటా కొందామనే ఆలోచన వచ్చినా సరే భయంతో వణికిపోతున్నారు. గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, వరుస ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులన్ని కలిసి టమాటా ధరను కొండెక్కించాయి.


 ఈమధ్య కాలంలో పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురిశాయి. ముఖ్యంగా సింధ్, బలూచిస్థాన్, దక్షిణ పంజాబ్ వంటి ప్రాంతాల్లో గతంలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. కుంభవ‌ృష్టి వల్ల వేలాది ఎకరాల్లో టమాటా పంట నాశనమైంది. దీంతో దేశంలో టమాటా సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. దీనికి తోడు భారీ వర్షాలు, వరదలతో పాటుగా ఈమధ్య కాలంలో వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల పాక్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. దీంతో రవాణా ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల కూడా పంట సరైన సమయానికి మార్కెట్లకు చేరక.. ధరలు భారీగా పెరిగాయి.


భారత రూపాయితో పోలిస్తే.. పాకిస్తాన్ రూపాయి విలువ 0.31 పైసలుగా ఉంది. ఇక ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దీని ధర మరింత దారుణంగా పడిపోతుంది. ఇందువల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువల ధరలు భారీగా పెరుగుతన్నాయి. ఈ సంవత్సరం పాకిస్తాన్‌లో తీవ్ర పంట నష్టం మూలంగా.. ఆఫ్గనిస్తాన్, ఇరాన్ వండి దేశాల నుంచి టమాటా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ పాక్ రూపాయి విలువ తగ్గడం వల్ల టమాటా రేటు భారీగా పెరిగింది. వీటితో పాటు గతంలో టమాటా సాగు చేసిన వారికి మద్దతు ధర లభించకపోవడం.. వాతావరణ మార్పుల వల్ల ప్రతిసారి భారీగా నష్టాలు రావడం వంటి కారణాల వల్ల ఈ సంవత్సరం రైతులు టమాటా సాగు వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. రేటు పెరగడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.


టమాటా ధరలు తరచుగా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా 2 ప్రధాన పంటల సీజన్‌ల మధ్య కొద్దిగా కొరత ఏర్పడటం సర్వసాధారణం. అయితే ప్రస్తుత ఆర్థిక, వాతావరణ పరిస్థితులు ఈ సాధారణ కొరతను మరింత తీవ్రతరం చేశాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరత సృష్టించి.. ధరలను ఒక్కసారిగా పెంచుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa