ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధూ మాదిరిగా ఆ నది నీళ్లు నిలిపేత,,,పాక్ విషయంలో భారత్‌ను ఫాలో అవుతోన్న తాలిబన్లు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 10:04 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌‌‌కు భారత్ సింధూ నది జలాలను నిలిపివేసినట్టుగా ప్రస్తుతం అఫ్గనిస్థాన్‌ కూడా అదే దారిలో నడుస్తోంది. తమ దేశంలో కునార్ నదిపై ‘సాధ్యమైనంత త్వరగా’ ఆనకట్టలు నిర్మించి పాక్‌కు నీళ్లు పారకుండా చేయడానికి ఆఫ్ఘనిస్థాన్ ప్రణాళిక రచించింది. సుప్రీం నేత మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు తాలిబాన్ నీటిపారుదల శాఖ మంత్రి ముల్లాహ్ అబ్దుల్ లతీఫ్ మన్సూర్‌ ఎక్స్ (ట్విట్టర్) లో వెల్లడించారు. ‘అఫ్గన్‌కు తన స్వంత నీటిని వినియోగించుకునే హక్కు ఉంది... ఆనకట్ట నిర్మాణ పనులు దేశీయ సంస్థలే చేపడతాయి’ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తాలిబన్ లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థకు తాలిబన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను తాలిబన్లు ఖండిస్తోంది.


తాలిబన్ల తాజా నిర్ణయం పహల్గామ్‌ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలను ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన 24 గంటల తర్వాత.. 65 ఏళ్ల కిందట వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీలైనంత ఎక్కువ నీటిని వాడుకునేలా ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి రూపకల్పన చేస్తోంది.


ఇక, దాదాపు 500 కి.మీ. పొడవైన కునార్ నది జన్మస్థలం పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ జిల్లాలోని హిందూ కుష్ పర్వతాలు. పాక్‌లో పుట్టి ఇది దక్షిణాన ఆఫ్గన్‌లోకి ప్రవేశించి, కునార్, నంగర్హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి, అనంతరం కాబూల్ నదిలో కలుస్తుంది. అక్కడ నుంచి తూర్పు దిశగా పాకిస్థాన్‌‌లోకి తిరిగి ప్రవేశించి పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరం సమీపాన సింధు నదిలో ఈ రెండూ కలుస్తాయి. కాబూల్ నదిగా గుర్తింపు పొందిన ఇది పాక్‌లో ప్రవహించే అతిపెద్ద నదులలో ఒకటి. సింధూ నదిలాగే ఇది కూడా వ్యవసాయం, తాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తికి కీలక వనరు. ముఖ్యంగా అఫ్గన్-పాక్ సరిహద్దు హింసకు మూల కేంద్రంగా ఉన్న ఖైబర్ పఖ్తూంఖ్వా‌కు ఈ జలాలే ఆధారం.


ఈ నదిపై అఫ్గన్ ఆనకట్టలు నిర్మిస్తే ఇప్పటికే భారత్ సింధూ జలాలను భారత్ నిలిపివేయడం వల్ల దాహంతో ఎండిపోతున్న పాకిస్థాన్‌‌ మరింత కష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సింధూ జలాల ఒప్పందం లాంటిది ఆ రెండు దేశాల మధ్య లేకపోవడం. అంటే, అఫ్గన్‌పై ఒత్తిడి తెచ్చి వెనక్కి తగ్గించే విధంగా పాక్‌‌కు తక్షణ చట్టపరమైన మార్గమూ కూడా లేదు. దీని ఫలితంగా పాక్-అఫ్గన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


ఆగస్టు 2021లో అఫ్గన్‌‌ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు దేశంలోని ప్రవహించే నదులు, కాలువలపై దృష్టి సారించారు. మధ్య ఆసియా వైపు పశ్చిమ దిశగా ప్రవహించే నదులను కూడా నియంత్రించేందుకు, ఆహార భద్రత కోసం డ్యామ్‌లు, కాలువలు నిర్మిస్తున్నారు. ఉత్తర అఫ్గన్‌లో నిర్మాణంలో ఉన్న వివాదాస్పదమైన ఖోష్ టేపా కాలువ ఇందుకు ఉదాహరణ. దాని పొడవు సుమారు 285 కిలోమీటర్లు కాగా, దీని వల్ల దాదాపు 5.5 లక్షల హెక్టార్ల సాగులోకి వస్తుందని భావిస్తున్నారు.


నీటిపారుదల నిపుణుల ప్రకారం.. ఈ కాలువ ద్వారా అమూ దర్యా నది ప్రవాహంలో దాదాపు 21 శాతం వరకు నీటిని మళ్లించే అవకాశం ఉంది. దాంతో,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న ఉజ్బెకిస్థాన్, తుర్కిమెనిస్థాన్ వంటి దేశాలు తీవ్ర ప్రభావానికి గురువుతాయి. కాగా, ఇటీవల భారత్‌కు మొదటిసారి అధికారిక పర్యటనకు వచ్చిన తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ.. హెరాత్ ప్రావిన్సుల్లో ఆనకట్ట నిర్మాణం, నిర్వహణకు న్యూఢిల్లీ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa