తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆగ్రహారానికి చెందిన ఏడుమంది శుక్రవారం రోజున.. వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదికి ఈత కోసమని వెళ్లారు. ప్రమాదవశాత్తూ నదిలో గల్లంతయ్యారు. అయితే ఈ విషయాన్ని స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడారు.మరో నలుగురు గల్లంతు కాగా.. సమాచారం అందుకున్న అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్న హోం మంత్రి అనిత.. ఘటనపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. డ్రోన్ సాయంతో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు లభించాయని.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈతకు వెళ్లిన మరో ముగ్గురిని స్థానికులు రక్షించినట్లు హోం మంత్రి వివరించారు. భారీ వర్షాల వల్ల నదులు, చెరువులు, కాలువల్లో నీరు ఉదృతంగా ప్రవహిస్తోందని.. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత కోరారు.
తిరుపతి జిల్లా వార్తలు.. మరికొన్ని..
నిండుకుండల్లా జలాశయాలు..
మరోవైపు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆకాశగంగ, పాపవినాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలలోకి భారీగా నీరు చేరింది. వరద నీటితో గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు ఒక గేటును తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు.
భక్తుల మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనాలు, వసతి ఏర్పాట్లంటూ భక్తులను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి మీద తిరుమల టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా తిరుమల పోలీసులు.. వంశీకృష్ణ అనే వ్యక్తిని జీఎన్‌సీ టోల్ గేట్ వద్ద అరెస్టు చేశారు. వంశీకృష్ణ ‘ట్రావెల్స్’ పేరుతో భక్తులను పరిచయం చేసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. తనకు టీటీడీ ఉద్యోగాలు తెలుసని.. వారి ద్వారా దర్శనాలు, వసతి ఏర్పాట్లు చేస్తానని చెప్పి భక్తుల నుంచి డబ్బులు లాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa