ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశ్రీ రవిశంకర్‌కు 'వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025

national |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 08:04 AM

భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గౌరవం లభించింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఏఐ వరల్డ్ సొసైటీ సంయుక్తంగా ఆయనకు "వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025"ను ప్రకటించాయి. గడిచిన దశాబ్దకాలంగా (2015-2025) ప్రపంచ శాంతి, సయోధ్య, మానవతా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. "స్వార్థం, పక్షపాతం లేని శాంతి వారధి" అని ఫోరం ఆయనను అభివర్ణించింది.గతంలో జపాన్ ప్రధాని షింజో అబే, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నేతలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన శ్రీశ్రీ రవిశంకర్ నిలవడం భారత దేశానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో శ్రీశ్రీ రవిశంకర్ చేపట్టిన మానవతా కార్యక్రమాలు, సంఘర్షణల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలకు ఈ అవార్డు అద్దం పడుతోంది. ముఖ్యంగా కొలంబియాలో 52 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ, ఎఫ్ఏఆర్‌సీ గెరిల్లాల మధ్య వివాదాన్ని ముగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఇరాక్, శ్రీలంక, మయన్మార్, వెనిజులా వంటి దేశాల్లో శాంతి స్థాపన కోసం మధ్యవర్తిత్వం వహించారు. ఆయన స్థాపించిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ ద్వారా శ్వాస, ధ్యానం వంటి ప్రక్రియలతో మానసిక ఒత్తిడిని తగ్గించి ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తున్నారు.ఈ పురస్కారం అందుకున్న అనంతరం శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. "శాంతి అనేది కేవలం ఒక పదం కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. మనం భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాం, కానీ శాంతికి తక్కువ శ్రద్ధ చూపిస్తాం. శాంతిని నెలకొల్పడం చాలా ముఖ్యం. మన సమాజంలో నెలకొన్న అపనమ్మకం, సంక్షోభాన్ని తొలగించగల నైతిక, ఆధ్యాత్మిక శక్తి మనకు అవసరం" అని ఆయన పేర్కొన్నారు. ఈ పురస్కారం ప్రపంచ యవనికపై భారత ఆధ్యాత్మిక, మానవతా నాయకత్వానికి లభించిన గుర్తింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa