వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయిందని వైయస్ఆర్‌సీపీ నేతలు కొనియాడారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైయస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు. సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసనమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురహంకార, ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా 2027నుంచి వైయస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, సాకె శైలజానాథ్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, రుహుల్లా, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa