ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ కోడ్ అమలులో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 07:15 PM

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రతి విషయంలోనూ తెలుగు రాష్ట్రాల మధ్య సారూప్యతలు చూడటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా మరో అంశం ప్రస్తావనకు వచ్చింది. కొత్తగా నిర్మించిన వాణిజ్య భవనాలలో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎనర్జీ కంజర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) అమలు చేస్తోంది. ఈ కోడ్ అమలులో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 786 కమర్షియల్ బిల్డింగ్‌లలో ECBC ఆమోదించారు. ఇది దేశంలోనే అత్యధికం. ఈ విషయంలో తెలంగాణ (738), పంజాబ్ (552), ఉత్తరప్రదేశ్ (201), హర్యానా (100), కేరళ (57), ఉత్తరాఖండ్ (12) ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. మొత్తంగా, ఈ రాష్ట్రాలలో 2,446 భవనాలు ఇప్పుడు ECBC ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.


మరోవైపు ఇంధన వినియోగం తగ్గించేందుకు 2014లోనే ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా విశాఖపట్నంలో ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎనర్జీ ఎఫిసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించారు, ఫలితంగా భారీ ఇంధన ఆదా, ప్రపంచ గుర్తింపు లభించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ , బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలు కలిసి పనిచేసి, ఈ నిబంధనలను రాష్ట్రంలో కఠినంగా అమలు చేశాయి.


 మరోవైపు ఈసీబీసీ కోడ్ అమలతో కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా.. పౌరులకు, రాష్ట్రానికి కూడా ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. విద్యుత్ ఆదా అవడమే కాకుండా.. పవర్ గ్రిడ్‌పై విద్యుత్ భారం తగ్గుతుందంటున్నారు. అలాగే విద్యుత్ కోతల సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు.


ఈ కోడ్ అమలు కారణంగా ఇంధన సామర్థ్యం మెరుగుపడటంతో.. ఆయా భవన యజమానులకు విద్యుత్ బిల్లులు తగ్గుతాయంటున్నారు. మరోవైపు దేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో భవన నిర్మాణ రంగం వాటా దాదాపు 30 శాతం వరకు ఉందని లెక్కలు చెప్తున్నాయి. దీన్ని తగ్గించడంలో ఎనర్జీ కంజర్వేషన్ బిల్డింగ్ కోడ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa