ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకు ఏ వయసు వారు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 10:15 PM

ఏ వయసు వారైనా సరే ఈజీగా చేయగలిగే వ్యాయామం వాకింగ్. రోజూ నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాకింగ్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం అన్ని వయసుల వారికి రోజువారీ నడకను సిఫార్స్ చేస్తున్నారు నిపుణులు.


నడక అనేది మీ మొత్తం శరీరాన్ని చురుకుగా ఉంచే వ్యాయామం. వాకింగ్ శరీరంలోని ప్రతి భాగాన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేస్తుంది. క్రమం తప్పుకుండా నడిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు.


అలాంటి వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే, చాలా మందికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో పూర్తి క్లారిటీ లేదు. రోజుకు ఏ వయసు వారు ఎన్ని అడుగులు నడవాలో ఇక్కడ తెలుసుకుందాం. స్త్రీ, పురుషుల స్టెప్స్ కౌంట్‌ ఛార్ట్‌పై ఓ లుక్కేద్దాం.


 పరిశోధన ఏం చెబుతుంది?


స్వీడన్‌లోని కల్మార్ విశ్వవిద్యాలయంలోని 14 మంది పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. నడక.. ప్రతి ఒక్కరి వయస్సును పరిగణనలోకి తీసుకుంటే.. బరువు పెరగడాన్ని నియంత్రించడంలో సాయపడుతుంది.


అంతే కాకుండా అనేక ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధుల్ని నిర్వహించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్యాల్ని కంట్రోల్ చేయగలదు. ఈ పరిశోధన ఆధారంగా ఒక వ్యక్తి వయస్సు ఆధారంగా రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసుకుందాం.


6 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలు


పిల్లల ఎముకలు, కండరాల్ని బలోపేతం చేయడానికి వాకింగ్ మంచి ఆప్షన్. పిల్లలు, టీనేజర్లు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ చేయాలి. ఇందులో బ్రిస్క్ వాకింగ్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


పరిశోధన ప్రకారం.. 6 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఎంత ఎక్కువగా నడిస్తే, అది వారికి అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వయస్సు మధ్య ఉన్న మగపిల్లలు రోజుకు కనీసం 15,000 అడుగులు వేయాలి. బాలికలు రోజుకు 12,000 అడుగులు నడవాలి.


18 నుంచి 40 ఏళ్లు


శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. ఒక వయోజనుడు రోజుకు 10,000 అడుగులు నడవాలి, కానీ వయస్సు పెరిగే కొద్దీ దీనిని తగ్గించాలి. అయితే ఇది కఠినమైన, వేగవంతమైన నియమం కాదు. స్వీడన్ రిపోర్ట్ ప్రకారం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు, మహిళలు ఇద్దరూ రోజుకు 12 వేల అడుగులు నడవాలి.


40 ఏళ్లు దాటినవారు


40 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అవుతాయి. అంతేకాకుండా అనవసరంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ వయస్సులో రోజుకు 11,000 అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


50 నుంచి 65 ఏళ్ల వయసు


50 ఏళ్లలోపు వారు ఖచ్చితంగా ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి 60 ఏళ్లలోపు వారు రోజుకు కనీసం 8 వేల అడుగులు నడవాలి. 60 ఏళ్లు పైబడిన వారు తరచుగా నడవడానికి ఇబ్బంది పడతారు. వీళ్లు 7000 అడుగులు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక, 65 ఏళ్ల వయసు పైబడ్డ వారు సుమారు 3,000 నుండి 5,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.


నడక వల్ల కలిగే ప్రయోజనాలు


​రోజూ నడవడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. వాకింగ్ వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.


అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండెలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ప్రమాదం తగ్గుతుంది. ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది.


వాకింగ్ ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది.


రోజువారీ నడక వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది. కండరాలు బలంగా, దృఢంగా మారతాయి.


బరువు తగ్గాలనుకునేవారికి వాకింగ్ మంచి వ్యాయామం. రోజూ నడవడం వల్ల కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి.


ఎముకలు, కీళ్లు బలంగా మారతాయి. కీళ్ల దృఢత్వం నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa