అధిక రక్తపోటు సమస్యను ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి ఐదు మందిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నారు. చిన్న వయసు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడినట్టు నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. అధిక రక్తపోటు వారి మెదడు, గుండె, కిడ్నీలతో పాటు ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే తల్లిదండ్రులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో హై బీపీ ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ శ్రీ ఫణి భార్గవి( కన్సల్టెంట్- DNB పీడియాట్రిక్స్, FNB పీడియాట్రిక్ కార్డియాలజీ, రెయిన్ బో హాస్పిటల్స్) చెప్పారు.
డాక్టర్ ప్రకారం హై బీపీ ఉంటే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే అప్రమత్తమై పిల్లల్ని తీవ్ర ముప్పు బారి నుంచి కాపాడుకోవచ్చు. పిల్లల హై బీపీ లక్షణాలు, నివారణ మార్గాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పిల్లల్లో అధిక రక్తపోటుకు కారణాలు
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ WHO ప్రకారం.. అధిక రక్తపోటు రెండు రకాలు. ప్రాథమిక రక్తపోటు, ద్వితీయ రక్తపోటు. గంటల తరబడి మొబైల్ టీవీ చూడటం, చదువుపై అదనపు ఒత్తిడి, నిద్ర లేకపోవడం, పండ్లు - కూరగాయలు తక్కువగా తినడం, స్వీట్లు ఎక్కువ తినడం, క్రీడలకు దూరంగా ఉండటం, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత, ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది.
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, రిఫ్లక్స్ నెఫ్రోపతి, పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి, హైపర్ థైరాయిడిజం, కుషింగ్స్ సిండ్రోమ్, పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్‌ప్లాసియా కూడా పిల్లల్లో అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. స్టెరాయిడ్స్, గర్భనిరోధక మాత్రలు, మాదకద్రవ్యాలు, స్లీప్ అప్నియాతో పాటు ధమనుల ఆర్థ్రోసిస్ వంటి గుండె జబ్బులు కూడా పిల్లల హై బీపీకి కారణమవుతున్నాయి.
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు
పిల్లల్లో అధిక రక్తపోటు ముందుగా ఎలాంటి లక్షణాల్ని చూపించదు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చని డాక్టర్ అంటున్నారు. ఆ లక్షణాలు ఏంటంటే..
శ్వాస ఆడకపోవడం
అలసట
ఏ కారణం లేకుండా బరువు పెరగడం
అధిక చెమట
అస్పష్టమైన దృష్టి
నిరంతరం తలనొప్పి
వికారం, వాంతులు
వేగవంతమైన హృదయ స్పందన
శ్వాస సమస్యలు
ఛాతీ నొప్పి
ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ సూచిస్తున్నారు.
డాక్టర్ ఏం చెప్పారంటే
పిల్లల బీపీ, బీఎంఐ చెక్ చేయించాలి
2000 సంవత్సరం వరకు అధిక రక్తపోటు వృద్ధుల వ్యాధిగా మాత్రమే పరిగణించబడింది. కానీ గత రెండు దశాబ్దాల్లో పిల్లలు, టీనేజర్లు కూడా దీని బారిన పడుతున్నారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పిల్లలు యవ్వనంలోనే అధిక రక్తపోటు కారణంగా గుండె, మూత్రపిండాల వ్యాధుల బాధితులుగా మారతారు.
అంతేకాకుండా ఊబకాయంతో బాధపడుతున్న దాదాపు ప్రతి ఐదో బిడ్డ హై బిపితో బాధపడుతున్నారు. వారిలో 50 శాతం మందికి తమకు బీపి సమస్య ఉందని కూడా తెలియదు. నగరాల్లో నివసించే 20 శాతం మంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. అందుకే పిల్లలకు రెగ్యులర్‌గా బీపీ, బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) చెక్ చేయించాలని నిపుణులు చెబుతున్నారు.
చికిత్స
అధిక రక్తపోటు ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. మందులతో పాటు, జీవనశైలి మార్పులు కూడా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సాయపడే ఆహారాల్ని భాగం చేసుకోవాలి. ఉప్పు తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. 4 నుంచి 8 వయసు గల పిల్లలు రోజుకు 1,200 mg కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. పెద్ద పిల్లలు రోజుకు 1,500 mg వరకు తినొచ్చు.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లల రక్తపోటు, BMI ని ఏటా తనిఖీ చేయడం చాలా అవసరం. పిల్లలకు సమతుల్య ఆహారాన్ని అందించండి. అంతేకాకుండా పిల్లలకు శారీరక శ్రమ అవసరం. పిల్లల స్క్రీనింగ్ టైమ్ తగ్గించండి. అంటే ఫోన్లు, టీవీలు చూడటం తగ్గించాలి.
ఆటలు ఆడించడం, వాకింగ్, రన్నింగ్ వంటివి పిల్లలతో చేయించండి. జంక్ ఫుడ్, స్వీట్లకు వారిని దూరంగా ఉంచండి. చదువులపై అదనపు ఒత్తిడి పెట్టొద్దు. ఆహారంలో ఉప్పు తగ్గించండి. ఎనిమిది గంటలు పిల్లలు నిద్రపోయేలా చూసుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa