భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరును దుర్వినియోగం చేస్తూ ఓ కొత్త పైరసీ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో కలకలం రేపింది. sbiterminsurance.com అనే డొమైన్ పేరుతో రూపొందించిన ఈ సైట్ మొదట చూపులో అధికారిక ఇన్సూరెన్స్ పోర్టల్‌లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే పూర్తిగా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల పైరసీ లింకులతో నిండి ఉంటుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షల మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా ఈ సైట్‌లోని ‘టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్ & రివైవల్ గైడ్’ అనే పేజీకి వెళ్తే నేరుగా పైరేటెడ్ సినిమాలు ప్లే అవుతున్నాయి. తాజా రిలీజులతో సహా వందలాది చిత్రాలు ఉచితంగా స్ట్రీమింగ్ చేసే వెసులుబాటు కల్పించారు. ఇలా బ్యాంకు బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా రూపొందించిన ఈ ఫేక్ సైట్‌ను సైబర్ నేరగాళ్లు ఎప్పుడు లాంచ్ చేశారో స్పష్టత లేదు. కానీ కొద్ది రోజులుగా ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఈ విషయం తెలిసిన వెంటనే SBI అధికారులు అప్రమత్తమైంది. బ్యాంకు సైబర్ సెక్యూరిటీ టీమ్ ఈ డొమైన్‌ను గుర్తించి, తక్షణమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు పేరును దుర్వినియోగం చేయడం, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, పైరసీ కార్యకలాపాలు అనే మూడు కోణాల్లో కేసు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాలు, సర్వర్ లొకేషన్, ట్రాఫిక్ సోర్సెస్‌ను ట్రేస్ చేస్తూ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ సైట్‌ను బ్లాక్ చేయడానికి ఐటీ మంత్రిత్వ శాఖకూ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. బ్యాంక్ కస్టమర్లు ఇలాంటి ఫేక్ సైట్లలో మోసపోకుండా అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in, sbigeneral.in) మాత్రమే ఉపయోగించాలని SBI హెచ్చరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa