ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 06:37 PM

శ్రీ సత్యసాయి బాబా మానవ రూపంలో అవతరించిన దైవమని, ఆయన తన సామాజిక సేవ, ఆధ్యాత్మిక భావనలు, అహింసా మార్గంతో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి ఎల్లప్పుడూ సాయపడు, ఎవరినీ నొప్పించకు అనే బాబా బోధనలు విశ్వవ్యాప్తమని ఆయన అన్నారు. ఆదివారం పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక గొప్ప సంకల్పంతో 1926 నవంబర్ 23న సత్యసాయి బాబా ఈ పుణ్యభూమిలో అవతరించారు. తన 86 ఏళ్ల జీవితాన్ని ఇక్కడే గడిపి, భగవాన్ సాయి తత్వాన్ని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని పంచి, సరైన మార్గాన్ని చూపించారు" అని స్మరించుకున్నారు. కేవలం 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవిక ఆలోచనలున్న వ్యక్తిగా బాబా ఉండేవారని తెలిపారు. 14 ఏళ్ల వయసులో, 1940 మే 23న, తన అసలు పేరు సత్యనారాయణ రాజును త్యజించి, తనను తాను 'సత్యసాయి'గా ప్రకటించుకున్నారని వివరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారని, కానీ సత్యసాయి ఈ పవిత్ర భూమిని ఎంచుకున్నారని అన్నారు. చిత్రావతి నది ఒడ్డున ఉన్న పుట్టపర్తిని ఆధ్యాత్మిక, దైవిక కేంద్రంగా మార్చారని చంద్రబాబు ప్రశంసించారు.సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలతో సత్యసాయి బాబా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1960లో సత్యసాయి సంస్థల స్థాపనతో ఆయన సేవలు విస్తృత రూపాన్ని సంతరించుకున్నాయని గుర్తుచేశారు. విశ్వశాంతి, విశ్వమానవ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని బాబా ఆకాంక్షించారని, అందుకే దేశవిదేశాల నుంచి ఎందరో సంపన్నులు, ప్రముఖులు స్వచ్ఛందంగా పుట్టపర్తికి వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారని తెలిపారు. ఎక్కడా దొరకని ప్రశాంతతను వారు ఇక్కడ పొందారని చెప్పారు.సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్ఫూర్తి ఈ ప్రదేశమంతా నిండి ఉందని చంద్రబాబు అన్నారు. ప్రశాంతి నిలయాన్ని ఒక 'ఎనర్జీ సెంటర్'  అభివర్ణించారు. సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున నిర్మించిన ప్రశాంతి నిలయం, ఆధ్యాత్మిక వేడుకలకు వేదికగా, భక్తుల కష్టనష్టాలకు పరిష్కార వేదికగా నిలిచిందని కొనియాడారు. 'మానవ సేవే మాధవ సేవ' అని విశ్వసించిన బాబా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా తన సేవలను మరింత విస్తరించారని తెలిపారు. వైద్యం, విద్య, తాగునీరు, మానసిక సంతృప్తి వరకు ప్రతీదాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారని అన్నారు.సత్యసాయి ట్రస్ట్ సేవలను వివరిస్త 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు ఉచిత విద్యను పొందుతున్నారని, ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల ద్వారా ప్రతిరోజూ 3,000 మందికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని 1,600 గ్రామాల్లో రూ. 550 కోట్ల వ్యయంతో 30 లక్షల మందికి పైగా ప్రజల దాహార్తిని తీర్చారని, చెన్నై తాగునీటి ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 250 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. నేడు సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2,000 కేంద్రాలతో విస్తరించిందని, సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా 10 జోన్లలో సాయి తత్వాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. సత్యసాయి సంస్థల్లో 7.50 లక్షల మంది సేవా సభ్యులు ఉండటం గర్వకారణమని అన్నారు. సత్యసాయి సేవలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా అధికారికంగా శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa