తీవ్రమైన దిత్వా తుఫాను వల్ల శ్రీలంక అతలాకుతలం అయిన నేపథ్యంలో.. భారత్ తక్షణమే స్పందించింది. ఆదేశానికి మానవతా సాయం అందించేందుకు కొత్తగా ఓ ఆపరేషన్ చేపట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరుతో.. అక్కడి ప్రజలకు అన్ని రకాలుగా సాయం చేస్తోంది. దిత్వా తుఫాను కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ద్వీప దేశంలో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు 123 మంది మరణించగా.. 130 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.
నవంబర్ 27వ తేదీన తుఫాను తీరాన్ని తాకగా.. భారత్ వెంటనే స్పందించింది. నవంబర్ 29వ తేదీ శనివారం నాడు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం 12 టన్నుల మానవతా సాయాన్ని కొలంబోకు చేర్చింది. ఈ సాయంలో గుడారాలు, టార్పాలిన్‌లు, దుప్పట్లు, పరిశుభ్రత కిట్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే దీనికి ఒక రోజు ముందే అంటే నవంబర్ 28వ తేదీన కూడా భారత్ అత్యవసర HADR సామాగ్రిని పంపింది. శ్రీలంకలో ఉన్న భారత నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి నుంచి 4.5 టన్నుల డ్రై రేషన్లు, 2 టన్నుల తాజా రేషన్లు సహా నిత్యావసరాలను కొలంబోకు అందజేశారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా చెబుతూ.."ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి కొలంబోలో సహాయక సామగ్రిని అందజేస్తున్నాయి. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి" అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీలంకలో ప్రాణ నష్టంపై సంతాపం వ్యక్తం చేస్తూ.. బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. "మన సన్నిహిత సముద్ర పొరుగు దేశానికి సంఘీభావంగా, ఆపరేషన్ సాగర్ బంధు కింద సహాయక సామగ్రి, HADR మద్దతును పంపాం" అని మోదీ తెలిపారు. ఈ సహాయక చర్యలు తమ 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం, 'విజన్ మహాసాగర్' మార్గదర్శకత్వంలో జరుగుతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
దిత్వా తుఫాను కారణంగా తూర్పు, మధ్య ప్రాంతాల్లో 300 మీల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటం వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా సుమారు 44,000 మంది ప్రభావితం అయ్యారు. సైన్యం, పోలీసు బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. పొలొన్నరువాలో ఒక వంతెనపై చిక్కుకుపోయిన 13 మందిని ఎయిర్‌లిఫ్ట్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ భారీ వర్షాల కారణంగా బండారునాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (BIA) కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి.. 15 విమానాలను కేరళలోని తిరువనంతపురం, కొచ్చిన్ విమానాశ్రయాలకు మళ్లించారు. తుఫాను ప్రస్తుతం శ్రీలంకను దాటి దక్షిణ భారతదేశం వైపు పయనిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa