ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిబ్బంది సమయపాలనపై డీజీసీఏ మార్గదర్శకాలు,,,, 35 శాతానికి పడిపోయిన ఇండిగో సర్వీసులు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 07:58 PM

దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యం కాగా.. ఇంకొన్ని రద్దవ్వడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నాటికి ఇండిగో విమాన సర్వీసులు కేవలం 35 శాతానికి పడిపోయాయి. బుధవారం ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా పలు విమానాశ్రయాల్లో దాదాపు 200 విమానాలు రద్దయ్యాయి. కొత్త నిబంధనలతో సిబ్బంది కొరత ఏర్పడి ఈ గందరగోళానికి దారితీసింది. గత నెలలో ప్రవేశపెట్టిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల ప్రకారం.. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి సమయం ఇవ్వాలి. దీనికి అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను మార్చుకోవడంలో ఇండిగో ఇబ్బంది పడుతోంది. ఇటీవల సోలార్ రేడియేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా 6 వేల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.


సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొన్ని విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఎనిమిది గంటలపైగా ఆలస్యమయ్యాయి. దేశీయ విమానయాన మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో షెడ్యూల్‌లో అంతరాయం ఏర్పడటంతో మొత్తం వ్యవస్థపై ప్రభావం పడింది. దీనిపై ఇండిగో స్పందిస్తూ..‘గత రెండు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు తీవ్ర అంతరాయానికి గురైంది నిజమే.. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం... ఊహించని ఆపరేషనల్ సవాళ్లు, చిన్న సాంకేతిక సమస్యలు, శీతాకాలం కారణంగా షెడ్యూల్ మార్పులు, వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, అప్‌డేట్ చేసిన ఫ్లైట్ డ్యూటీ నిబంధనలు వంటి అనేక అంశాలు మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. వీటిని ముందుగానే ఊహించడం సాధ్యం కాలేదు’’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.


ఎఫ్టీడీఎల్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, ఏడాదికి 1,000 గంటలు మాత్రమే విమానయానం చేయాల్సి ఉంటుంది. ప్రతి సిబ్బందికి వారి ఫ్లైట్ సమయానికి రెట్టింపు విశ్రాంతి, ఏదైనా 24 గంటల వ్యవధిలో కనీసం 10 గంటల విశ్రాంతి తప్పనిసరి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించి, అలసట వల్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా డీజీసీఏ ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది.


వీలైనంత త్వరగా సాధారణ స్థితీకి తీసుకొచ్చి, సర్వీసులను పునరుద్దరించడానికి తమ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఇండిగో ప్రకటించింది. అంతేకాదు, రద్దయిన విమానాల్లో టిక్కెట్ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్ చెల్లిస్తున్నామని, విమానాశ్రయానికి వెళ్లే ముందు దయచేసి తాజా విమాన స్థితిని చూసుకోవాలని కోరింది.


శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం నుంచి ప్రయాణికులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డారు. 33 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి.. విమానాల స్థితిపై తాజా అప్‌డేట్‌ల కోసం దయచేసి ఇండిగో కస్టమర్ సర్వీస్ టీమ్‌ను నేరుగా సంప్రదించాల ప్రయాణికులను కోరుతున్నాం’ అని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, మదురై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఇండిగో విమానాలు, అలాగే ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్, హుబ్లీ, భోపాల్‌కు వెళ్లే విమానాలు రద్దయ్యాయి.


బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా 42 దేశీయ విమానాలు రద్దయ్యాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో నిర్వాకంతో తెల్లవారుజాము 3 గంటల నుంచి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుపోయి, కీలక మీటింగ్‌కు హాజరుకాలేకపోయాయనని ఓ నెటిజన్ వాపోయాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa