ఇండిగో సంక్షోభం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా విమానాలు రద్దు అవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్‌కు రావాల్సిన, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 100కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు అంతా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. దీనికి తోడు తమ లగేజీలు కనిపించడం లేదంటూ ప్రయాణికులు వాపోయారు. ఈ గందరగోళ పరిస్థితిలో శంషాబాద్‌కు వస్తున్న మూడు విమానాల్లో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదింపులు వచ్చాయి. మంగళవారం (డిసెంబర్ 9) మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమచారం. ఆ దుండగుడు రూ. 9 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టుకు అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. డాగ్ స్వ్కాడ్, బాంబు స్వ్కాడ్ రంగంలోకి దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టును క్షణ్ణంగా గాలించారు. శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో సోదాలు చేశారు. కాగా, అమెరికాలోని న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని అందులో పేర్కొన్నాడు. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేల్చేస్తా అంటూ బెదిరించాడు. బాంబు పేలకూడదంటే ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9 కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం (డిసెంబర్ 7)లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కన్నూర్– హైదరాబాద్, ఫ్రాంక్‌ఫర్ట్– హైదరాబాద్, లండన్– హైదరాబాద్ విమానాల్లో బాంబు పెట్టినట్లు ఓ ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆ విమానాలు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ చెకప్ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విమానాల్లో తనిఖీ చేశారు. ప్రయాణికుల లగేజీలు, క్యాబిన్ బ్యాగులతో సహా అని తనిఖీ చేశారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించింది.
ఇటీవల శంషాబాద్‌కు వచ్చిన ఎమిరేట్స్ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa