ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లోనూ సిడ్నీ తరహా దాడులకు ఛాన్స్..యూదు, ఇజ్రాయెల్ సముదాయాల్లో భద్రత కట్టుదిట్టం

national |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 08:08 PM

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ బాండీ బీచ్‌లో డిసెంబరు 14న జరిగిన ఉగ్రదాడితో భారత్‌‌ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు... సిడ్నీ తరహదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ముఖ్యంగా కొత్త ఏడాది వేడుకలు సమీపిస్తున్న తరుణంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఐసిస్ ప్రేరేపిత ఉగ్రమూకలు పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకోవచ్చని అలర్ట్ చేశాయి. యూదుల పండుగ హనుక్కా మొదటి రోజున బాండీ బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు నవీద్ జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోగా.. మరో 38 మంది గాయపడిన సంగతి తెలిసిందే.


నిందితులు ఐసిస్ భావజాలంతో ప్రభావితమయ్యారని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ స్వయంగా ప్రకటించారు. ఈ తండ్రీ కొడుకుల్లో ఒకరి వద్ద భారత పాస్‌పోర్టు ఉండగా.. గత నెల ఇరువురూ ఫిలిప్పీన్స్‌కు వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. ఈ పరిణామాలతో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు భారత నిఘా సంస్థలు (ఐబీ) సూచించాయి. సిడ్నీ దాడిని ఉదాహరణంగా చూపి, ఐసిస్ అనుబంధ గ్రూప్‌లు యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో వేర్పాటువాద డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని కూడా తీవ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్లకు ఒక సాధనంగా వాడుకుంటున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా పర్యాటకులు వచ్చే గోవా వంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేసిన జైషే మహమ్మద్ ప్రేరేపిత వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడకు తెగబడిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు.


పోలీసులు ఏమాత్రం అలసత్వంగా ఉన్నా ముష్కర మూకలు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, కాబట్టి అప్రమత్తత అత్యవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక మీడియా పేర్కొన్న నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో యూదు, ఇజ్రాయెల్‌కు సంబంధిత ప్రదేశాలపై దాడులు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఈ హెచ్చరికలను అత్యంత తీవ్రమైనవిగా భద్రతా వర్గాలు అభివర్ణించాయి. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా యూదుల ప్రార్థనా స్థలాలు, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు, అలాగే యూదు, ఇజ్రాయెల్ సముదాయాలు నివసించే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పలు పట్టణ కేంద్రాల్లో నిఘాను విస్తరించడంతో పాటు, సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa